Hydra : హైడ్రా..ఈ మాట వింటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇంతవరకూ పెద్దవారిపై ప్రతాపం చూపిన హైడ్రా.. ఇప్పుడు సామాన్యులపై ఎగబడుతోంది. దీంతో తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం హైడ్రాకు మరింతగా అధికారాలు ఇవ్వటం.. కూల్చివేతల పైన హైడ్రా దూకుడుగా వెళ్లటం రాజకీయంగా వివాదంగా మారుతోంది. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను అధికారులు మార్క్ చేస్తున్నారు. ఇప్పుడు వారికి మద్దతుగా బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది.ఈ కూల్చివేతల వ్యవహారంలో దిగువ మధ్య తరగతి కుటుంబీకులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు కొత్తగా మూసీ నది పరీవాహక ప్రాంతంలో కూడా కూల్చివేతలను చేపట్టడం కలకలం రేపుతోంది. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించడానికి ఇదివరకే రెవెన్యూ అధికారులు ఇళ్లకు మార్కింగ్ సైతం పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో- ఇప్పటికే మూసీ నిర్వాసితులు లంగర్ హౌస్ వద్ద భారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టడం, బీఆర్ఎస్‌ను ఆశ్రయించడం తెలిసిందే.
తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డితో భేటీ అయ్యారు. కన్నీటితో తమ ఆవేదను వారికి వివరించారు.తాజాగా మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటన చేపట్టింది. బీఆర్ఎస్నేతల బృందానికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు. స్థానికులకు హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం భరోసా కల్పించింది. రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి, రూ.లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ చేపట్టడం ఏంటని హరీశ్‌రావు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, పథకాలకు డబ్బులు లేవంటూనే మూసీ డీపీఆర్కే రూ.1500 కోట్లు ఖర్చు చేస్తారా అని మండిపడ్డారు. మూసీకి అంత ఖర్చు చేసేవారు రూ.150 కోట్లతో కనీస వైద్య సదుపాయాలు కల్పించలేరా అంటూ నిదీసారు. 7 నెలల నుంచి మధ్యాహ్నా భోజన బిల్లు రావట్లేదని విమర్శించారు. కాళేశ్వరం కూలిపోయింది అంటూనే గోదావరి నీళ్లు తెస్తామంటున్నారని హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని, మూసీ పరీవాహక ప్రజలను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోమని హరీశ్‌రావు హెచ్చరించారు. మూసీలో మురికి నీరు రాకుండా చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రతీ బస్తీకి తమ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే అండగా నిలుస్తారని వెల్లడించారు. అటు బీజేపీ సైతం ఈ అంశం పైన కార్యాచరణకు సిద్దమవుతోంది. దీంతో…ఇప్పుడు రేవంత్ ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
హైడ్రా విషయంలో బీజేపీ సైతం దూకుడు పెంచింది. పేదల ఇళ్లను నేలమట్టం చేస్తున్న అధికారులు.. పెద్దలను వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేదల పక్షాన నిలిచేందుకు అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్ యాక్షన్‌ప్లాన్ సిద్దం చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో ఇన్నాళ్లు తలోమాట మాట్లాడిన బీజేపీ నేతలంతా ఏకతాటి మీదకు వచ్చినట్టు తెలిసింది. హైడ్రా దూకుడుకు కళ్లం వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అటు బీఆర్‌ఎస్ పార్టీ కూడా న్యాయపరంగా బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా తానుంటానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ హయంలో 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టామని, హైడ్రా బాధితులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూకట్ పల్లి నియోజక వర్గంలో ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు. జీహెచ్ఎంసీ, బుద్ద భవన్, ఐమాక్స్, సెక్రటరేటిట్ లు అన్ని కూడా నాళాల పైనే ఉన్నాయని అన్నారు. మంత్రుల ఇళ్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నాయని, ముందు వీటిని కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు హైడ్రా కూల్చివేతలపై బీజేపీ నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. హైడ్రా కూల్చివేతల్ని కొందరు నేతలు సమర్థిస్తే మరికొందరు నేతలు వ్యతిరేకించారు. కొందరు నేతలైతే హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే నేతల మధ్య భిన్న వాదనలు కనిపించడంతో క్యాడర్ సైతం పరేషన్ అయ్యింది. ప్రస్తుతం నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటల సీరియస్ కామెంట్స్ చేశారు. కేవలం పేదలనే టార్గెట్ చేసి ప్రభుత్వం అత్యం హీనంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజర్లతో షెడ్లను కూలగొట్టి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూకట్‌పల్లి నల్లచెరువులో హైడ్రా కూల్చివేతల ప్రాంతాన్ని ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సామాన్యులకు శని, ఆదివారాల్లో కోర్టులు అందుబాటులో ఉండవని తెలిసే కావాలనే కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపించారు. చెరువులు కాపాడాలంటే ముందు ప్రభుత్వ, ప్రయివేటు భూములు లెక్కించాలని డిమాండ్ చేశారు.మొత్తంగా హైడ్రా కూల్చివేతల విషయంలో అధికార పార్టీని ఇరుకునే పెట్టేందుకు బీజేపీ- బీఆర్‌ఎస్ సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.