BRS : అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? పార్టీలో పదవులు అనుభవించిన నేతలు పక్కచూపులు చూస్తున్నారెందుకు? అధినేత వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా? లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని భావించారా? కేటీఆర్, హరీష్ రావు చూసుకుంటారులే అని ధీమాతో ఉన్నారా? తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఇదే ఆసక్తికర చర్చ.టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌ను, ఆ పార్టీని అభిమానులు అక్కున చేర్చుకున్నారు. ఉద్యమ నేతగా కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా కార్యకర్తలు, అభిమానులు దానిని సక్సెస్ చేశారు. ఉద్యమకాలం నుంచి పార్టీకి అండదండగా నిలిచారు. ఆది నుంచి పార్టీలో కేసీఆర్ చెప్పిందే నడిచింది. ఆయన చెప్పినట్లే నేతల నుంచి కింది స్థాయి నాయకుల వరకూ పాటించారు. ఏనాడూ కూడా, ఎక్కడా కూడా పార్టీలో అసంతృప్తి కనిపించిన దాఖలాలు లేవు.
టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన నేతలు ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామాలు చేసినా.. మరోసారి అక్కున చేర్చుకున్నారు. ఎన్నిసార్లు ఎన్నికల్లో అన్ని సార్లు ఓటు వేసి గెలిపించుకున్నారు. ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. స్థానిక సంస్థల వరకు కూడా ఎక్కడ చూసినా గులాబీ జెండాలు దర్శనమిచ్చాయి. ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లడంలోనూ కేసీఆర్ ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు సాగారు. చివరకు ఎలాగోలా రాష్ట్రం అయితే సిద్ధించింది.రాష్ట్రం ఏర్పాటు తరువాత వచ్చిన ఎన్నికల్లోనూ కేసీఆర్‌ను బంపర్ మెజార్టీతో గెలిపించి.. ఆయనకే ముఖ్యమంత్రి హోదా దక్కేలా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కష్టపడ్డారు. అయితే.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని రెండు కళ్లు అన్నట్లుగా ముందుకు నడిపించారు. ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తూనే ఏనాడూ పార్టీని ఆయన నిర్లక్ష్యం చేయలేదు. పార్టీ ఊపును మాత్రం అలాగే కొనసాగించారు.
అయితే.. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతల్లో ఓ ప్రచారం ఉంది. ఆ పదేళ్లు కింది స్థాయి కార్యకర్తలను, నాయకులను అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ కానీ, ఇతర ముఖ్యనేతలు పెద్దగా పట్టించుకోలేదని అపవాదు ఉంది. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ ఎవరూ పెద్దగా ఐడెంటిటీ ఇవ్వలేదనే అభిప్రాయం ఇప్పటికీ చాలా మంది నేతల్లో నాటుకు పోయింది. ఎంతసేపు కేసీఆర్ పార్టీని, పెద్ద తలకాయలనే పట్టించుకున్నారని.. కింది స్థాయి నాయకత్వానికి పెద్దగా భరోసా ఇవ్వలేకపోయారని మండిపడుతున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. అప్పటి నుంచి అధినేత కేసీఆర్ కూడా తన ఫామ్‌హౌజ్ వదిలి ఇంతవరకు బయటకు వచ్చింది లేదు. కార్యకర్తలకు ధైర్యం కల్పించిందీ లేదు. కనీసం ఓటమిపై సమీక్షలు చేసిందీ లేదు. దాంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ అలాంటి చేదు ఫలితాలనే చవిచూడాల్సి వచ్చింది. కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. దాంతో కేడర్‌లో మరింత అసంతృప్తి పెరిగింది. రెండు ఎన్నికల ఫలితాల్లోనూ పార్టీకి ఊహించని ఫలితాలు వచ్చినప్పటికీ పార్టీ పెద్దగా పట్టించుకోకపోవడం ఏంటని చాలా వరకు బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కనిపించింది. గతంలో నామినేటెడ్ పదవుల్లోనూ అన్యాయం జరిగిందనే అభిప్రాయం వారిలో ఉంది. కనీసం నేతలను కలిసేందుకు కూడా సమయం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. కట్ చేస్తే.. రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. బీసీ కులగణన పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు బీఆర్ఎస్ నిత్యం జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే వీటికి కూడా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతే తప్ప కేసీఆర్ వచ్చి కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించకోలేదని సెకండ్ కేడర్ లీడర్లు ఇప్పుడు పార్టీపై అసంతృప్తి తెలుపుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాము గుర్తుకు రాలేదని.. ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో గుర్తుకు వచ్చామా అని వారి మధ్య చర్చ నడుస్తున్నట్లు టాక్. అప్పుడు గుర్తించకుండా.. ఇప్పుడు సమావేశాలకు పిలిస్తే ఎలా వస్తామని బాహాటంగానే ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అధికారం శాశ్వతం కాదని, కార్యకర్తలు, నాయకులే పార్టీకి ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలని సమావేశాలకు రాకుండా ఉండిపోతున్నారని తెలుస్తోంది.
మరోవైపు ఇటీవల హన్మకొండ జిల్లా నేతలతో సమావేశమైన కేటీఆర్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో కార్యకర్తలను పట్టించుకోని అంశం నిజమేనని.. మరోసారి అలాటి తప్పు రిపీట్ కాకుండా చూసుకుందామని పిలుపునిచ్చారు. పార్టీకి జవసత్వాలు తీసుకొద్దామని కోరారు. కార్యకర్తలు, నాయకుల్లో ఒక్కసారిగా ఇంతటి అసంతృప్తి రావడానికి నేతలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నట్లుగా కనిపిస్తోంది. రాబోతున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ సెకండ్ కేడర్ లీడర్ల నుంచి ఇలాంటి సహాయ నిరాకరణ కనిపిస్తుండడంతో పార్టీ ముఖ్యనేతలంతా ఇప్పుడు ఆలోచనలో పడ్డారని సమాచారం.మొత్తానికైతే సెకెండ్ కేడర్ ను రంగంలో దించి పూర్వ వైభవం దిశగా పార్టీని తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నాయకత్వం గట్టి పట్టుదలతో ఉందన్న మాట.