Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర ప్రజలే కాదు.. జాతీయ స్థాయిలో ఉన్న ప్రముఖ నేతలు సైతం విమర్శిస్తున్నారు. ఒక రాష్ట్రానికి సీఎం హోదాలో ఉండాల్సిన అర్హత ఆయనకు లేదని తేల్చేస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధిపై సరైన రీతిలో దృష్టి సారించకపోవడం, మరోవైపు విపత్తులు ఏర్పడినప్పుడు చాకచక్యంగా వ్యవహరించకపోవడం చూస్తే అది నిజమే అనిపిస్తుంది. తాజాగా మాజీ కేంద్ర మంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడమే ఇందుకు ఉదాహరణ. చంద్రబాబు వట్టి అబద్ధాల కోరు అని, ఆయన ఆడే అబద్ధాలకు ఒక పెద్ద చరిత్రే ఉందని ప్రముఖ న్యాయవాది, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి సుబ్రమణియన్ స్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఏపీలో తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయం నుంచే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఒక ముఖ్యమంత్రి లాంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం ఏ మాత్రం సరికాదంటూ సుబ్రమణియన్ స్వామి ఖండించారు. చంద్రబాబు చేస్తున్న ఇలాంటి దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని శ్రీవారి భక్తులకు సూచించారు. రాజకీయ లబ్ది కోసం దేవుడిని కూడా ఉపయోగించుకోవడం మహా పాపమని చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబు చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతన ఉండదని దుయ్యబట్టారు. గతంలో కూడా ఏసుక్రీస్తు ఫొటోలున్నాయని.. కొండపై అన్యమత ప్రచారం జరుగుతుందని అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసి దేవుడిని అవమానించారు చంద్రబాబు. కాగా, లడ్డూ వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.