Jagan: గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకే ఒక్కసారి బెంగళూరు వెళ్లారు. కానీ, అధికారం కోల్పోయిన ఈ వంద రోజుల్లో తరచూ బెంగళూరు వెళ్లి వస్తున్నారు. దీని వెనక ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరోవైపు.. జగన్ జాతీయ స్థాయిలో వైసీపీని బలోపేతం చేయాలని చూస్తున్నట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ మేరకే ఇండియా కూటమికి జగన్ దగ్గరవుతున్నట్లు సమాచారం. ఇదే జగన్ బెంగళూరు వెళ్లడం వెనక అసలైన కారణంగా కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ, జనసేనలు ఎన్డీయే కూటమిలో ఉన్నాయి. దీన్ని బట్టి ఎలా చూసినా.. ఎన్డీయేకి వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపు జగన్ మొగ్గు చూపడంలో ఎలాంటి సందేహం లేదు.
కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నంలోనే జగన్ తరచూ బెంగళూరు వెళ్తున్నారని వైసీపీ శ్రేణులు కూడా చర్చించుకుంటున్నాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈ మధ్య ఎక్కువగా జగన్ మంతనాలు జరుపుతున్నారట. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సహాయంతో జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్లు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నేతలు వైసీపీని వీడి వలస బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో వైఎస్ జగన్ చక్రం తిప్పడానికి ప్రణాళికలు రచిస్తున్న క్రమంలోనే తరచూ బెంగళూరు వెళ్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.