చంద్రబాబుపై మరోసారి పైచేయి సాధించిన పెద్దిరెడ్డి..ఇక కుప్పంకు బ్యాండే
వైసీపీ కీలక నేతలలో మంత్రి పెద్దిరెడ్డి కూడా ఒకరు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. జగన్ తరువాత పార్టీలో అంతటి సమర్థత కలిగిన నేతగా పెద్దిరెడ్డి పేరు సంపాదించారు. తనతో పాటు, తన చూట్టు పక్కల నియోజకవర్గాలను కూడా గెలిపించుకోగలిగిన సత్తా పెద్దిరెడ్డికి ఉందని ప్రత్యర్థి పార్టీ నేతలే చెబుతుంటారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. సుధీర్ఘ కాలంగా రాజకీయాలలో కొనసాగుతున్నారు. మొదట కాంగ్రెస్‌లో తరువాత జగన్ స్థాపించిన వైసీపీలో చేరి..మంత్రి పదవులను అనుభవిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పెద్దిరెడ్డికి నిత్యం విభేదాలు ఉంటూనే ఉన్నాయి.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది కేవలం పెద్దిరెడ్డితోనే సాధ్యం అవుతుందని జగన్ కూడా భావిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి కూడా పెద్దిరెడ్డి కుప్పంలో ప్రత్యేక నిఘా పెట్టి మరి పని చేస్తున్నారు. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. దీనిలో భాగంగానే వచ్చే ఎన్నికల్లో కూడా కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలని పెద్దిరెడ్డికి జగన్ బాధ్యతలు అప్పగించారు. ఈక్రమంలోనే కుప్పంను మున్సిపాలిటీగా మార్చారు. పెద్దిరెడ్డి కుప్పంను టార్గెట్ చేయడంతో.. వచ్చే ఎన్నికల్లో పుంగునూరులో పెద్దిరెడ్డిని ఓడిస్తానని శపథం చేశారు. దీనిలో భాగంగానే కిలారి కిషోర్ కుమార్ రెడ్డికి టీడీపీ తరుఫున పుంగునూరు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించడం జరిగింది.
అయితే సార్వత్రిక ఎన్నికల ముందే పుంగునూరుతో పాటు పీలేరు నియోజకవర్గంలో టీడీపీకి బిగ్ షాకిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి. టీడీపీకి చెందిన కీలక నేతలను వైసీపీలోకి తీసుకుని చంద్రబాబుకు పెద్దిరెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జి.వి. శ్రీనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయన 1994లో పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 1994 లో గెలిచిన తర్వాత… 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీనాథ్ రెడ్డి 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలోనే ఉన్నా ఆయనకు టిక్కెట్ దక్కలేదు. అయితే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరడంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జి.వి శ్రీనాధ్ రెడ్డితో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా వైసీపీలో చేరారు. ఇదిలా ఉంటే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కూడా ఓడించడానికి పెద్దిరెడ్డి స్కెచ్ వేస్తున్నారని… దీనిలో భాగంగానే పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నేతలను వైసీపీలోకి చేర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ముందు ఇలా టీడీపీ కీలక నేతలను వైసీపీలో చేర్చుకుని …మరోసారి చంద్రబాబుపై పెద్దిరెడ్డి పై చేయి సాధించినట్టు అయిందని విశ్లేషకులు అంటున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో బాబుకు బ్యాండే అని వైసీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.