Chandrababu-YCP: శ్రీవారి ప్రసాదం లడ్డూ వివాదంలో రోజురోజుకీ టీడీపీ కూటమి ప్రభుత్వం లొసుగులు మరిన్ని బయటపడుతున్నాయి. అధికార పార్టీ చేస్తున్న రాద్ధాంతంపై వైఎస్సార్సీపీ నిజాలు రాబట్టాలని గట్టిగానే నిలదీస్తోంది. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు, సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నియమించడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కోట్లాది హిందువుల మనోభావాలకు సంబంధించిన శ్రీవారి లడ్డూ వివాదంలో దేశం మొత్తం సీబీఐ విచారణ కోరుతుంటే.. చంద్రబాబు మాత్రం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కేసును దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా వివాదస్పద, పక్షపాతంతో వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ సారథిగా నియమించడం పలు అనుమానాలకు తావిస్తోంది. లడ్డూ వివాదాన్ని మొదట లేవనెత్తింది చంద్రబాబే కాబట్టి.. విచారణ జరిగితే ముందుగా ఆయన నుంచే సమాచారం సేకరించడం న్యాయంగా ఉంటుందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.
ఇదే అంశంపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ సీబీఐ, సిట్టింగ్ జడ్డీతో విచారణ జరిపించాలని అన్నారు . రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారిపై తప్పుడు ప్రచారం చేసిన వారికి దేవుడే తగిన శిక్ష విధిస్తాడని చెప్పుకొచ్చారు. కులాలు, మతాలు అంటూ రెచ్చగొడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై విమర్శలు సంధించారు. మరోవైపు, ఇదే అంశంపై కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డూపై దుష్ప్రచారం చేస్తూ.. వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం దారుణం అని అన్నారు . లడ్డూలో నిజంగా కల్తీ జరిగిందని చంద్రబాబు, లోకేష్ తిరుమలలో ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తిరుమల లడ్డూ ప్రసాదం ద్వారా వైఎస్ జగన్‌పై కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని, దమ్ముంటే ఆ ఆరోపణలు నిజమని నిరూపించాలని వైఎస్సార్‌సీపీ నేత వంగా గీత సవాల్ విసిరారు. సిట్ పేరిట చంద్రబాబు తమకు కావాల్సిన మనుషులతో విచారణ జరిపిస్తే ఎలా? అంటూ విమర్శలు చేశారు. తిరుమల లడ్డుపై ఆరోపణలు నిజాలని నిరూపించిన తర్వాత జగన్ డిక్లరేషన్ గురించి మాట్లాడండి అని గట్టిగానే బదులిచ్చారు.