Tirumala Laddu :
తిరుపతి లడ్డూ కల్తీ వివాదం మరింత పెద్దది అవుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా దీనిపై ఆందోళనలు జరుగుతున్నాయి. బిజీపే నేతలు కూడా నెయ్యిలో కల్తీ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల భక్తుల మనోభావాలకు చెందిన విషయంగా చెబుతున్నారు. నిజంగా లడ్డూ తయారు చేసే నెయ్యిలో యానిమల్ ఫాట్ కలిసిందా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత వైసీపీ హయాంలో జరిగిన దారుణల్లో ఇది అత్యంత హేయమైనది అని సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనడంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి లాంటి వాళ్ళు తెరపైకి వచ్చి ఈ ఆరోపణలను ఖండించారు. అయితే టీడీపీ నేతలు నెయ్యిని టెస్ట్ చేసిన రిపోర్ట్స్ బయట పెట్టారు. దానితో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
అంతవరకూ దీనిని రాజకీయ ఆరోపణగానే భావించిన వారు సైతం ఆ రిపోర్ట్ బయటకు రావడంతో షాక్ తిన్నారు. వివాదం మరింత ముదరడంతో మీడియా ముందుకు వచ్చిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదంతా ఫేక్ ప్రచారం అని కొట్టి పారేశారు. కేంద్రంలో బీజేపీ నాయకులు కూడా హాఫ్ నాలెడ్జ్‌తో అనవసర ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. అనేక టెస్టుల తర్వాతే నెయ్యిని తిరుమలకు అనుమతిస్తారని దానిలో కల్తీ జరిగే ప్రశక్తే లేదని కూడా జగన్ తెలిపారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే మాట్లాడిన టీటీడీ ఈవో శ్యామల రావు గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారు చేసే నెయ్యి లో కల్తీ జరిగిన మాట నిజమే అని అన్నారు. వెంటనే ఆ పాత డీలర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని చెప్పారు. ఈ వివాదంపై ఇంటర్నల్‌గా టీటీడీలో విచారణ చేస్తున్నామని అని కూడా చెప్పారు. ఆవు నెయ్యిని అంత తక్కువ ధరకు ఎలా సప్లయ్ చేస్తున్నారనే అనుమానంతో విచారణ ప్రారంభిస్తే అది కల్తీ నెయ్యి అనే విషయం బయటపడింది అని చెప్పు కొచ్చారు.
మరోవైవు ఏపీ ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి టీటీడీ ఈవోకు పిలువు వచ్చింది. ఇప్పటికే తమవద్ద ఉన్న రిపోర్ట్స్‌కు తోడు ఈవో దగ్గర ఉన్న ఆధారాలు కూడా పరిశీలించి ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ వివాదం పై సిబిఐ దర్యాప్తు కూడా అవసరం అని మిగిలిన రాజకీయ పక్షాలు, సెలబ్రిటీల నుంచి డిమాండ్ వస్తోంది. టీటీడీలో ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ఉన్నారు సామాన్య భక్తులు. మరి ఈ వివాదం మరెన్ని మలువులు తిరుగుతుందో చూడాలి