Tuesday, October 8, 2024

Telangana: లీకులు వెనుక ఉన్నదెవరు?కాంగ్రెస్ నేతలా? అధికారులా?

- Advertisement -

Telangana: తెలంగాణలో రాకరాక అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ప్రస్తుతానికి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నా ఆ పార్టీ మార్కు రాజకీయం ఆ పార్టీనే కలవరపెడుతోంది. సీఎం రేవంత్ తో పాటు మంత్రులు ఎప్పుడు దొరుకుతారా..ఎప్పుడు బుక్ చెద్దామా అన్నట్టు సొంత పార్టీ నేతలే ఎదురుచూస్తున్నారు. ఆపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంది. మరో జాతీయ పార్టీ బీజేపీ కాచుకొని కూర్చొంది. ఈ తరుణంలో చిన్నపాటి అనుమానాలు సైతం పెనుభూతాలుగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు అలకపాన్పు ఎక్కుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇక తమ దారితాము చూసుకోవడమే మేలన్న నిర్ణయానికి వస్తున్నారు.

అయితే తెలంగాణలో కాంగ్రెస్ నాలుగు ఆకులు చదివితే.. బీఆర్ఎస్ అంతకంటే రెండాకులే చదివి ఉంది. ఉద్యమ పార్టీగా, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా బీఆర్ఎస్ కు ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. తాత్కాలికంగా అధికార మార్పిడి చేశారే తప్ప శాశ్వతం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఒక వైపు బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సెక్రటేరియట్‌లో లీకులు క‌ల‌వ‌ర పెడ‌తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చి ప‌ది నెల‌లు గ‌డుస్తున్నా…. సచివాలయంలో గులాబీదళం వేగులు చురుగ్గా పనిచేస్తున్నారని ప్రభుత్వ పెద్దల్లో అనుమానం ఎక్కువవుతోందంటున్నారు. స‌ర్కార్ స‌మాచారం మొత్తం స‌చివాల‌యం గోడ దాటుతుండ‌టమే ప్రభుత్వ పెద్దల అనుమానాలకు కారణమంటున్నారు. గోడ‌ల‌కు చెవులు ఉన్నాయ‌న్నట్లు… నాలుగు గోడ‌ల మ‌ధ్య… మాట్లాడుకున్న స‌మ‌చారం కాస్త… గోడ దాటుతుండ‌టమే… ఇప్పుడు చ‌ర్చనీయాంశ‌ంగా మారింది.

అధికారంలోకి వ‌చ్చిన కొత్తలో… స‌ర్కార్ స‌మాచారం లీకవడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చార‌ంటున్నారు. అధికారుల తీరు మార్చుకోవాలని… లేకపోతే… విష‌యం కాస్త సీరియ‌స్‌గా ఉంటుంద‌ని… స్మూత్ అండ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు టాక్. అయినా…. వ్యవ‌హారంలో మాత్రం నో ఛేంజ్ అంటున్నారు. ఎంత చెప్పినా… ఇన్ఫర్మేష‌న్ మాత్రం ష‌రా మామూలుగానే… బీఆర్ఎస్ భ‌వ‌న్‌కు చేరిపోతుంద‌ని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని కేటీఆర్ సైతం ప్రస్తావిస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు కారాలు మిరియాలు నూరుతున్నట్లు చెబుతున్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఏం జ‌రుగుతందో… ఏం జరగనుందో మాకు తెలుస్తుందన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై ప్రభుత్వం అప్రమత్తం అయినట్లు టాక్‌ నడుస్తోంది. ప్రభుత్వ స‌మాచారం లీక్ చేస్తున్నది ఎవరంటూ ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.

స‌చివాయ‌లంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు ఉంటారు. స‌మీక్షలు, ప్రత్యేక స‌మీవేశాలు… వన్ టూ వన్ భేటీలు… ఇలా నిత్యం వివిధ శాఖ‌ల‌ పరిపాల‌న గురించి… మాట్లాడుకుంటుంటారు. అయితే…మంత్రుల ఛాంబ‌ర్ల‌ నుండి… సీఎం రేవంత్ ఉండే 6th ఫ్లోర్ వ‌ర‌కు… ఏ ఛాంబ‌ర్‌లో… ఎవ‌రు … ఎవ‌రితో మాట్లాడుకుంటున్నారు… ఏ అంశంపై మాట్లాడుకుంటున్నారు అన్నది… క్షణాల్లో గులాబీ పెద్దల‌కు తెలిసిపోతుంద‌ట‌. ఈ మ‌ధ్య జరిగిన మంత్రివర్గం సమావేశంపైనా గులాబీ ముఖ్య నేత … త‌న స‌న్నిహితుల ద‌గ్గర ప్రస్తావించిన సంగ‌తి సీఎం రేవంత్ రెడ్డి వ‌ర‌కు చేరింద‌టంటున్నారు. దీంతో… స‌చివాల‌యంలో ఏం జ‌రుగుతోంది అంటూ సీఎం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నార‌ని చెబుతున్నారు.ఇంటి దొంగ‌ల‌ను ఈశ్వరుడైనా ప‌ట్టలేడ‌న్నట్లు…. స‌ర్కార్‌లో ఉంటూ… తిన్నింటి వాసాలను లెక్కపెడుతున్న ఆ కొంద‌రి పని పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్‌ అయినట్లు చెబుతున్నారు. ఈ లీకుల వెన‌క అధికారులు ఉన్నారా? లేక నాయ‌కులు ఎవరైనా బీఆర్‌ఎస్‌ పెద్దలతో టచ్‌లో ఉంటూ ఇక్కడి విషయాలను అక్కడికి చేర్చుతున్నారా? అన్నది తేల్చాలని ఇంటిలిజెన్స్‌ అధికారులను సీఎం ఆదేశించారని సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!