YS Jagan: ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఖాళీ అని అనుకున్నారు అంతా. కానీ, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. జిల్లాల వారీగా అధ్యక్షుల నియామకాలు చేపడుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. జగన్ అంటే గిట్టని బద్ధ వ్యతిరేకులు.. జగన్ అంటే జగమొండి అని కూడా అంటుంటారు. అందుకే పార్టీని వీడి వెళ్లేవారిపై దృష్టి సారించకుండా ఉన్నవాళ్లే పార్టీకి మూలస్థంభాలని నమ్ముతూ అకుంఠిత దీక్షతో కొనసాగుతున్నారు. వైసీపీకి ఈ కష్టాలు కొత్తేమి కాదు.. పార్టీని ఒంటిచేత్తో నడిపించి పాదయాత్రలతో, ప్రజల్లో ఆదరాభిమానాలతో సాగి 2019లో చక్రం తిప్పారు. అందుకే జగన్ రూటే సెపరేటు అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ప్రజల నుంచే పార్టీకి మద్దతు కావాలని వైసీపీ అధినాయకత్వం ఆశిస్తోంది.
ప్రస్తుతం జిల్లాల వారీగా సీనియర్లను నియమించే పనిలోనే ఉంటున్నారు. మొత్తం అన్ని జిల్లాలకు బాధ్యుల నియామకం పూర్తయిన తర్వాత నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించి అప్పుడు జనంలోకి వెళ్లాలని జగన్ పూర్తి ప్రణాళికలతో ఉన్నట్లు సమాచారం. ఇదంతా పూర్తవడానికి ఏడాది పట్టినా.. సంక్రాంతి పండుగ అనంతరం జగన్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టాలని వైసీపీ యోచిస్తోంది. ఆ సమయానికల్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడెనిమిది నెలలు పూర్తవడంతో పాటు.. ప్రజలకు కూడా ప్రభుత్వం మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే కాస్త సమయం తీసుకునే పార్టీ నియామకాలు చేపడుతూ జనంలోకి వెళ్లాలని వైసీపీ చీఫ్ ఆలోచిస్తున్నారు.