Thirumala: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ తిరుగుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఏకంగా సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు సంచలనం రేపితే.. అదంతా అబద్దమని, చంద్రబాబు చేసే దుష్ప్రచారమని, రాజకీయ లబ్ది కోసమే టీడీపీ దేవుడిని ఇందులోకి లాగిందని వైసీపీ గట్టిగానే ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య వాదోపవాదాలు, ఆరోపణలు తీవ్ర స్థాయిలో చెలరేగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా అంతకు ముందు రోజు అంటే.. 27వ తేదీన జగన్ తిరుమల పర్యటనకు రానున్నారు. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలను బట్టి చూస్తే.. రాజకీయంగా వైసీపీని ప్రజల్లో మరింత దెబ్బ తీయాలనే ఆలోచనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 27న జగన్ తిరుమలకు చేరుకుని మరుసటి రోజు శనివారం స్వామివారిని దర్శించుకోనున్నారు. అయితే.. గతాన్ని ఒకసారి పరిశీలిస్తే.. 2004-19 మధ్యకాలంలో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర తర్వాత తిరుమల పర్యటనకు ఒక్కరే వచ్చారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. అది ముగిశాక తిరుపతి చేరుకుని అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమల చేరుకున్నారు. 2019లో అధికారం చేపట్టిన తర్వాత సీఎంగా జగన్ తిరుమలకు వచ్చారు. గరుడోత్సవం వేళ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు కూడా సమర్పించారు. అంతకు ముందు 2004 -2009లో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా తిరుమలకు వచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ఆర్ పాదయాత్ర చేపట్టారు. యాత్ర ముగింపులో రైలులో తిరుపతికి చేరుకుని అక్కడ అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు. ఈ నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటనలో అసలేం చేయనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.