ఒక ఊరిలో రాజు గారు ఉంటారు. ఆ రాజు గారి ప్రత్యర్థి వర్గం అదే గ్రామంలో తిష్ట వేసి, ఊరిలో అరాచకాలు చేస్తు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తారు. వారిని ఆ రాజుగారు ఎదిరిస్తూ ప్రజలను కాపాడుతూ ఉంటారు. తాము చేసే పనులకు రాజు అడ్డువస్తున్నాడని, అతనిని ఎలా అయిన తప్పించాలన్న క్రమంలో అతనిని మట్టు పెడతారు. రాజు గారి కుటుంబం మొత్తాన్ని మట్టు పెట్టె క్రమంలో రాజు గారి భార్య తన కొడుకుని ప్రత్యర్థుల నుంచి తప్పిస్తుంది. రాజు గారి కుటుంబం మొత్తం చనిపోతుంది. కానీ తప్పిపోయిన కొడుకు ఎక్కడో దూరంగా వేరే ప్రాంతంలో పెద్దవాడై తన జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. తరువాత తన తల్లి తండ్రుల కోసం వెతికే ప్రయత్నంలో ప్రత్యర్థులపై ఎలా పగ తీర్చుకుంటాడు అనేది సినిమా కథ.

ఇందులో రాజు పాత్రలో శరత్ కుమార్ కాగా, ప్రత్యర్థి పాత్రలో జగపతి బాబు, తప్పి పోయిన కుర్రాడే మన సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఇలాంటి స్టోరీతో తెలుగులో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. కథ రొటీన్ గానే ఉన్న స్క్రీన్ ప్లే తో సినిమాను ముందుకు తీసుకెళ్లడంపైనే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది.

మన సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అమెరికాలో నివసిస్తూ రియాలిటీ గేమ్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు, అదే రీతిలో అడ్వెంచర్ లైఫ్ ఇష్టపడే అతనికి, ఇండియన్ ట్రెడిషన్ కు సంబంధించి వీడియో గేమ్ చేసే ఆఫర్ వస్తుంది. ఆ వీడియో గేమ్ కాన్సెప్ట్ పంచభూతాల నేపథ్యంలో ఒక రివెంజ్ స్టోరీ కావడం హీరో ఆసక్తిగా దానిపై మక్కువ చూపుతాడు. ఇది అంతా జరుగుతున్న సందర్భంలో హీరోయిన్ పూజ హేగ్దెతో మన హీరో ప్రేమలో పడటం, తనతో చిన్నపాటి గొడవ వచ్చి విడిపోవడం, హీరోయిన్ ను కలుసుకోవాలని కుతూహలంతో హీరో ఇండియాకు వెళ్లి తన ప్రేమతో పాటు, తన ప్రత్యర్థులను ఎలా కలుసుకున్నాడనేదే ప్రధానమైన స్టోరీ. దీనికి పంచభూతాలు అనే ఒక కాన్సెప్ట్ తగిలించి దర్శకుడు ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే ప్రయత్నం చేసాడు.

సినిమా మొదటి భాగంలో యాక్షన్, రొమాన్స్, కామెడీపై సినిమాను ముందుకు నడిపిన దర్శకుడు రెండో భాగం పూర్తిగా యాక్షన్ నే నమ్ముకున్నాడు. మొదటి భాగంలో రొమాన్స్ స్పీన్స్, కామెడీ అంతా సో… సో గానే ఉన్నా, రెండో భాగంలో వచ్చే యాక్షన్ సీన్స్ తో మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని పక్కా కమర్షియల్ గా సినిమాను ముందుకు నడిపి కొంత విసుగు తెప్పించాడు. ఒకవైపున సినిమా అంత యాక్షన్ తో నింపేసి మధ్య మధ్యలో వచ్చే పాటలు పంటి కింద రాళ్ళలా విసుగుతెప్పిస్తాయి. సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా విలన్ పాత్రలో మరో సారి జగపతి బాబు తన విశ్వరూపాన్ని చూపించాడు. లెజెండ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జగపతిబాబుకి అన్నీ అలాంటి క్యారెక్టర్స్ రావడం వాటిలో జగపతి బాబు ఒదిగిపోవడంతో ప్రతి సినిమాలో జగపతి బాబుని బలమైన ప్రతినాయకుడి పాత్రలో చూపించడానికి దర్శకులు, రైటర్స్ ఇష్టపడుతున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు వేమన పద్యాలు చెబుతూ, కొంత కొత్తగా విలనిజాన్ని పోషించాడు. హీరో బెల్లం కొండ శ్రీనివాస్ మొదటి నుంచి పక్కా కమర్షియల్, యాక్షన్ సినిమాలు చేయడంతో తన నట ప్రదర్శన పూర్తిగా బయటకు రాలేదని చెప్పుకోవచ్చు. బెల్లం కొండ శ్రీనివాస్ యాక్షన్ ఫైట్స్ తో ప్రేక్షకులను మెప్పించగలిగాడు. హీరోయిన్ పూజ హెగ్డే అప్పుడప్పుడు మెరుస్తూ అలా కనపడి వెళ్లిపోతుంటుంది. ఇతర పాత్రలో జయప్రకాశ్, రావు రమేష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్ తదితరులు తమ పాత్రలకు తగట్లు న్యాయం చేసారు. పంచభూతాల కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అబ్బురపరచాలనుకున్న దర్శకుడు శ్రీవాస్ సినిమాను విజయ తీరాలకు చేర్చడంలో విఫలమయ్యాడు. ఫక్తు కమర్షియల్ గా యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారు టైం పాస్ కి వెళ్లి చూసిరావచ్చు.   

చివరగా : ప్రామిసింగ్ సినిమా కాదు గురు
రేటింగ్ : 2.5/5
రివ్యూ బై : శ్రీకాంత్ గుదిబండి