ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయనే సామేత దర్శకుడు శ్రీను వైట్లకు కరెక్ట్ గా సరిపోతుంది. ఒకప్పుడు శ్రీను వైట్లతో సినిమా తీయడానికి ఎంత కాలమైనా వెయిట్ చేసే హీరోలు, ఇప్పుడు శ్రీను వైట్ల దగ్గరకు వస్తుంటేనే బాబోయ్ అంటున్నారు. దీనికి కారణం శ్రీను వైట్ల తీసిన గత మూడు సినిమాలే… మహేష్ బాబుతో “ఆగడు”, రామ్ చరణ్ తో “బ్రూస్ లీ”, వరుణ్ తేజతో “మిస్టర్” సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్ లతో అదరగొట్టాడు. ఈ దెబ్బతో దాదాపుగా మరో సినిమాను చేయడానికి చాలా కలం పట్టింది.

రవితేజతో ఉన్న పరిచయాలకు తోడు… “నీ కోసం” సినిమాతో హీరోగా పరిచయం చేసి తరువాత “వెంకీ, దుబాయ్ శ్రీను” లాంటి రెండు మంచి హిట్ సినిమాలు అందించిన శ్రీను వైట్ల మీద ఉన్న కృతజ్ఞత అనుకోవచ్చు రవితేజ “అమర్ అక్బర్ ఆంటోనీ” సినిమా రూపంలో ఒక అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా ఈ 16వ తారీకు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై శ్రీను వైట్ల కెరీర్ ఆధారపడి ఉంది. ఈ సినిమా కనుక ప్లాప్ అయితే రవితేజకు వచ్చే నష్టమేమి ఉండదు. కానీ ఈ సినిమా ప్లాప్ అయితే శ్రీను వైట్ల దర్శకత్వ బాధ్యతలకు స్వస్తి పలికి ఇంటికి పరిమితమవ్వాల్సిందే.

“అమర్ అక్బర్ ఆంటోనీ” సినిమాకు సంబంధించి నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారి అడ్వాన్స్ లు రవితేజ దగ్గర ఉండటంతో రవితేజ ఇచ్చిన భరోసా మీద శ్రీను వైట్లను దర్శకుడిగా ఒప్పుకున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే కొత్తదనం ఏమి కనపడకపోగా చాల రొటీన్ గా ఉంది, శ్రీను వైట్ల మాత్రం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నాం అని చెబుతున్నాడు. ఈ సినిమా నిజంగా రొటీన్ రొట్టగా మిగిలిపోతుందో లేక శ్రీను వైట్ల చెప్పినట్లు డిఫరెంట్ క్యారెక్టర్ తో ఆకట్టుకొని దర్శకుడిగా మరోసారి బిజీ అవుతాడో లేదో మరో వారం వేచి చూడక తప్పదు.