Bigg Boss: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 కూడా పాజిటివ్ టాక్ తో రెండో వారాన్ని పూర్తి చేసుకుంది. మొదటి వారం బెజవాడ బేబక్క సిల్లీ కారణాలతో ఎలిమినేట్ కాగా, ఇప్పుడు రెండో వారంలో ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. ఇక పోతే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ స్టేజ్ మీదకు వచ్చి నాగార్జున ముందు మిగతా కంటెస్టెంట్ల గురించి చెప్పడం ఆనవాయితీ. అలాగే ఎలిమినేట్ అయిన తర్వాత శేఖర్ బాషా ఇంటి నుంచి బయటకు వెళ్తూ మిగతా కంటెస్టెంట్ల తమ అసలు రంగు బయటపెట్టారు.
సండే ఫండేలో భాగంగా కంటెస్టెంట్స్‌తో ఆటలు ఆడించిన నాగార్జున.. చివరకు సేవింగ్ ప్రాసెస్ లో భాగంగా సీత, పృథ్వీలు సేవ్ అని చెప్పి వారికి ఆనందాన్ని కలిగించారు. చివరికి ఆదిత్య, శేఖర్ బాషాలు మిగిలారు. ఈ ఇద్దరిలో ఎవరు ఇంటి నుండి వెళ్లాలి? ఎవరు ఉండాలి..? అని కంటెస్టెంట్లను డిసైడ్ చేయమని నాగార్జున ఓటింగ్ పెట్టారు. చివరకు మిగిలిన ఇద్దరు పోటీదారులలో సీత ఒక్కరే శేఖర్ బాషాకు ఓటు వేశారు. మిగిలిన వారంతా కూడా ఆదిత్యకే ఓటు వేశారు. శేఖర్ బాషా ఆటపై దృష్టి పెట్టకపోవడానికి కారణం తన బిడ్డ గురించి ఆలోచించడమేనని ఒక్కొక్కరు చూపించారు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉండి గేమ్ ఆడి కప్పు గెలవాలని ఆదిత్యకు చాలా కోరిక ఉందని, అందుకే ఓట్లు వేస్తున్నామని చెప్పారు.
ఇక శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యి బయటకు రాగానే సీత ఏడ్చేసింది. ఎట్టకేలకు వేదికపైకి వచ్చిన శేఖర్ బాషాతో నాగార్జున ఓ ఆట ఆడుకున్నాడు. హౌస్‌లోని కంటెస్టెంట్లలో అసలు ఎవరు..? ఫేక్ ఎవరు.. అని అడిగారు. అప్పుడు శేఖర్ బాషా ముగ్గురు కంటెస్టెంట్స్ గురించి చెప్పాడు.. సీత నా చెల్లి లాంటిది. ఆమె చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. గుండెల్లో నుండి మాట్లాడుతుంది. ఇక విష్ణుప్రియ ఇన్నోసెన్స్ కు పర్యాయపదం. చాలా అమాయకురాలు. విష్ణు ప్రియ గురించి మాట్లాడుతూ.. బయట చాలా మంది ఏదేదో అన్నారు.. కానీ విష్ణు ప్రియ చాలా అమాయకురాలు. ఎలా బతుకుతుందో ఏమో అనిపిస్తుంది. ప్రేరణ చాలా మంచి అమ్మాయి. జెన్యూన్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే సోనియా గురించి చెబుతూ నువ్వు ప్రశాంతంగా ఉన్నావనిపిస్తుంది. కానీ నామినేషన్ వస్తే మాత్రం మహంకాళి అయిపోతావు. మణికంఠ కావాలనే ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడు. ఆలోచించి ఎలా రియాక్ట్ అవ్వాలో క్యాలిక్యులేట్ చేసుకుని మరీ ఆడతాడంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా.