మహేష్ బాబుకు విషెష్ చెప్పినందుకు పూజ హేగ్దెను మహేష్ అభిమానులు టార్గెట్ చేసారు. ఈరోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు నటిస్తున్న “మహర్షి” సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు రిషి. ఈ పేరుతో ముద్దుగా “రిషి”కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది పూజ హేగ్దే. దీనితో అభిమానులు కోపోద్రికులై మహేష్ ను “సర్” అని పిలవకుండా అవమానిస్తావా అని బూతులు లంకించుకున్నారు.

అసలు అభిమానుల మనసులో తమ హీరో ఉన్నాడా? లేక అభిమానం పేరుతో క్రూరత్వంగా ప్రవర్తిస్తూ పైశాసిక ఆనందం పొందాలనుకుంటున్నారా? సీనియర్ ఎన్టీఆర్ ను అందరూ ఆ రోజులలో “ఎన్టీవోడు” అని పిలుచుకునేవారు. చిరంజీవినైతే ముద్దుగా “చిరు” అని పిలుచుకుని అభిమానులు సంబరపడిపోయేవారు.

కానీ ఒక హీరోని ఇంకో టాప్ హీరోయిన్ తన పుట్టిన రోజు సందర్భంగా విష్ చేసేటప్పుడు “సర్” అని పిలవాలంటే అది ఎంత వరకు సమంజసం. ఇలాంటి పోకడలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులలో కనపడుతాయి. ఇప్పుడు దానినే మహేష్ అభిమానులు కూడా ఫాలో అవుతున్నారనిపిస్తుంది.

గూఢచారి సినిమా బాగుందని కొన్ని రోజుల క్రితం మహేష్ సోషల్ మీడియాలో స్పందిస్తే, మన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్లపై బూతుల దండకం ఎత్తుకున్నారు. మహేష్ ను “సర్” అనడం తెలియదా అని మహేష్ కు లేని ఇబ్బంది వీరికి ఎక్కడ నుంచో వచ్చినట్లు తెగ హడావిడి చేసారు. ఇలాంటి జాడ్యాన్ని ముందుగానే కంట్రోల్ చేయకపోతే సోషల్ మీడియా వేదికగా బూతులు తప్ప మనకు మిగతావేమి కనపడవేమో రాబోయే రోజులలో…