సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతంగా మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. ఆయన నటించిన ‘బ్రహ్మోత్సవం’, ‘శ్రీమంతుడు’ చిత్రాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహరించారు మహేష్. ప్రస్తుతం ఆన్ లైన్ స్ట్రీమింగ్ మాధ్యమాల్లో వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో జియో ఎంటెర్టైన్మెంట్తో కలసి వెబ్ సిరీస్ నిర్మాణంలో బాగస్వామ్యం కాబోతున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ కు ‘చార్లీ’ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. హుస్సేన్ షా కిరణ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి ఈయన రచయితగా పనిచేశారు. డిటెక్టీవ్ జోనర్లో ‘చార్లీ’ వెబ్ సిరీస్ ఉంటుందని.. మొత్తం 24 ఎపిసోడ్లతో 3 సీజన్లుగా దీనిని ప్లాన్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను హిందీలో తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఉంటుందా? ఉండదా? అనేది క్లారిటీ లేదు.

కాగా మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్నాడు. మహేష్ కి ఇది 25 వ చిత్రం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు, అశ్వినీదత్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘వన్’ సినిమా నిరాశపర్చిన సంగతి తెలిసిందే. ఈ సారి ప్రయోగాలకు పోకుండా ప్రేక్షకులు మెచ్చే సినిమా తీయబోతున్నట్లు సుకుమార్ వెల్లడించాడు.