రామ్ గోపాల్ వర్మ ఈ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉందని వర్మను అభిమానించే అభిమానులు చెబుతుంటారు. వర్మ తీసుకొనే సంచలన నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి మరి. ఎక్కడ కాంట్రవర్సీ ఉంటుందని వర్మకు అనిపిస్తుంది దానిని హేండిల్ చేయడంలో సిద్ధహస్తుడు. వర్మ తీయాలన్న సినిమా ఆడినా ఆడకపోయినా దాని సంగతి తరువాత, ఆ సినిమా నిర్మించే అన్ని రోజులు తన సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోవడంలో వర్మను మించిన వారు లేరు. అందుకే వర్మ గురించి ఎన్ని రకాల బుక్స్ రాసినా, వర్మ ఎన్ని ఇంటర్వూస్ ఇచ్చినా, వర్మ ఇచ్చే కొత్త ఇంటర్వ్యూ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూసే వారు లక్షలలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

ఎప్పుడో సంవత్సర కాలం క్రితం తాను త్వరలో “లక్ష్మీస్ ఎన్టీఆర్”” పేరుతో సినిమా నిర్మిస్తున్నానని సంచలన ప్రకటన చేసి, తిరిగి దాని ఊసే ఎత్తలేదు. ఇక బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో తన తండ్రి జీవిత గాధను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్న సినిమా రెండు భాగాలుగా రానుందని, ఇక ఆ రెండు భాగాలు కూడా జనవరి 9వ తారీకు ఒకటి రెండొవ భాగం మరో 15 రోజుల గ్యాప్ తీసుకొని జనవరి 24వ తారీకు విడుదల చేస్తామని ఇప్పటికే డేట్స్ అనౌన్స్ చేసారు.

వర్మకి ఎందుకు మూడ్ వచ్చిందో తెలియదు గాని, సంవత్సరం క్రితం మొదలు పెడతానని చెప్పి పక్కన పడేసిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాకున్న బూజుని దులిపి మరోసారి వెలికి తీసి హడావిడిగా షూటింగ్ మొదలు పెట్టి జనవరి 24న విడుదలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మరో సంచలనానికి తెరతీసాడు.. వర్మ చెప్పిన డేట్ ప్రకారం అదే రోజు ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా డేట్ మార్చుకునే ప్రసక్తే వర్మ చేయడు. ఒక వేళ వర్మ సినిమా మూడు నెలలో కంప్లీట్ చేయలేడు ఏమో అని భావించడానికి వీలు లేదు. ఇప్పటికే వర్మ ” లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా ముంబై వేదికగా షూటింగ్ కంప్లీట్ చేసేసి, ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పినా చెబుతాడు. వర్మకి ఏదైనా సాధ్యమే. అందుకని వర్మ సినిమాతో పోటీ ఎందుకు అనుకున్నారో లేక, 15 రోజుల గ్యాప్ లో సినిమా విడుదలైతే సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపుతాయని అనుకున్నారో గాని, ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇక రెండు చిత్రాలు ఒకేరోజు రిలీజ్ అయితే కూడా ఇంకొక ప్రాబ్లెమ్ ఉంది. వర్మ తీసేది “లక్ష్మీస్ ఎన్టీఆర్” కచ్చితంగా ఆ చిత్రంలో దాదాపుగా చంద్రబాబు పాత్రకు కాస్త నెగటివ్ షేడ్స్ ఉండే అవకాశం ఉంది. చివరి రోజులలో ఎన్టీఆర్… చంద్రబాబుని ఏవిధంగా విమర్శించాడో అందరికి తెలియనిది కాదు. కానీ క్రిష్ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబుని హీరోగా ప్రాజెక్ట్ చేసి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.

అసలే సోషల్ మీడియా దెబ్బకు బెంబేలెత్తిపోతున్న రాజకీయనాయకులు ఇపుడు ఈ రెండు చిత్రాలలో ఏది నిజం, ఏది అబద్ధం అని రచ్చ మొదలుపెడితే అసలుకే మోసం వస్తుందని ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగాన్ని కాస్త వెనక్కు నెట్టి “లక్ష్మీస్ ఎన్టీఆర్”” సినిమాకు దారి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. చూద్దాం టాలీవుడ్ వర్గాలు చెబుతున్నట్లు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం వెనక్కు తగ్గి ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారా లేక అనుకున్న డేట్ జనవరి 24 తారీకునే వచ్చి “లక్ష్మీస్ ఎన్టీఆర్” కు సవాళ్లు విసురుతారో త్వరలో తేలనుంది.