నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత గాధకు సంబంధించి సినిమా రూపంలో ప్రజల ముందుకు తీసుకొని వెళ్లాలనుకున్న సమయంలో మొదట్లో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. మొదటగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తాడని, తరువాత ఆ స్థానంలో దర్శకుడు తేజ రావడం, సినిమా ఓపెనింగ్ కొబ్బరికాయ కొట్టడం, కొన్ని రోజులకు బాలకృష్ణ – తేజ మధ్య లుకలుకలు ఇలా సినిమా ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగడుగులు వెనక్కు అన్నట్లు సాగింది.

ఈ పరిణామాలతో బాలకృష్ణ తనకు మరుపురాని హిట్ సినిమాను అందించిన దర్శకుడు క్రిష్ ను రంగంలోకి దింపి సినిమా బాధ్యతలు అప్పగించాడు. ఇక క్రిష్ రాకతో మొత్తం సినిమా రూపు రెక్కలే మార్చేసి, సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే బాగుంటుందని బాలకృష్ణకు చెప్పి ఒప్పించాడు. బాలకృష్ణ కూడా సినిమా ఎన్ని భాగాలైనా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు సినిమా వెళ్ళవలసిందే అని పట్టుబట్టి ఒకే షెడ్యూల్ లో మొదటి భాగం ముగించారు. ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగంగా వస్తున్న “కథానాయకుడు” సినిమా ఇప్పటికే పూర్తి కాగా, డిసెంబర్ 2న టీజర్ విడుదల చేస్తారని తెలుస్తుంది.

ఇక రెండవ భాగం “మహానాయకుడు” షూటింగ్ కూడా డిసెంబర్ 25వ తారీకు నాటికి షూటింగ్ ముగించి గుమ్మడికాయ కొట్టేయాలని చూస్తున్నారు. ఈ సినిమాను మొదటగా 15 రోజుల గ్యాప్ తో రెండవ భాగం “మహానాయకుడు”ని జనవరి 24 విడుదల చేయాలని అనుకున్నా, తరువాత మొదటి భాగం కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందన్న భావనతో రెండవ భాగాన్ని ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేసారు. ఇక బాలకృష్ణ అనుకున్నట్లు రెండు భాగాలు షూటింగ్ అనుకున్న సమయానికి ఒకే షెడ్యూల్ లో షూటింగ్ ముగించి బాలయ్య స్పీడ్ తో యూనిట్ సభ్యులనే కాకుండా, ఇండస్ట్రీ వర్గాలను కూడా ఔరా అనేలా చేసాడు.