మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “అరవింద సమేత” టీజర్ ఆగష్టు 15 న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ టీజర్ పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, సినిమా టీజర్ లో ఎన్టీఆర్ గెటప్ అంతా మాస్ హీరోగా చూపించడమే అభిమానులకు రుచించడం లేదు. త్రివిక్రమ్ సినిమాలలో హీరోను ఆ గెటప్ లో చూపించడం కొత్తేమో కానీ ఎన్టీఆర్ కు ఇలాంటి మాస్ యాంగిల్స్ కొత్తేమి కాదు. “అజ్ఞాతవాసి” ప్లాప్ తరువాత వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ను సరికొత్త గెటప్ లో కొత్తగా చూపిస్తాడని ఆశ పడిన అభిమానులకు నిరాశే మిగిలింది. అందుకని అభిమానుల అంచనాలు అందుకోవడానికి మరొకసారి ఇంకో టీజర్ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.

ఇక ఈ సినిమా రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై బయ్యర్లు మంచి ఆసక్తితో ఉన్నారు. ఒకవైపున రాయల సీమ బ్యాక్ గ్రౌండ్ తో పాటు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటల తూటాలు సినిమాలో భారీగా పేలనున్నాయని టీజర్ చూస్తేనే అర్ధమైపోతుంది. ఇక ఎన్టీఆర్ కు రాయలసీమలో ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. దీనితో ఈ సినిమాకు సీడెడ్ లో మంచి పోటీ నెలకొంది. సీడెడ్ లో “అరవింద సమేత” సినిమాను 15 కోట్ల రూపాయలకు అమ్మి ఆశ్చర్యపరిచారు. ఒక్క సీడెడ్ లోనే 15 కోట్ల రూపాయలు అమ్ముడైతే, ఇక మిగతా ఏరియాలు మొత్తం కలుపుకొని 100 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ స్టామినా మరో రుజువు కానుంది.