విజయ్ దేవరకొండ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి బాతు గుద్దులా దొరికాడు. విజయ్ నటించిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు సంచలన విజయాలు నమోదు చేసుకోవడంతో విజయ్ వైపు బడా నిర్మాతల కన్ను పడింది. ఇప్పటికే గీతా గోవిందం సినిమా అయితే బడా హీరోల రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోయేలా కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. ఇక విజయ్ హీరోగా నటించిన మరో రెండు సినిమాలు “నోటా, టాక్సీవాలా” విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే “నోటా” సినిమా నవంబర్ 4న విడుదల చేయడానికి నిర్మాతలు ప్రకటించారు.

ఇక విజయ్ చేతిలో ఈ రెండు సినిమాలు కాకుండా మరో మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో యువి క్రియేషన్స్, అల్లు అరవింద్ ఇలా బడా నిర్మాతలతో వర్క్ చేయనున్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీ అవుతుందని, త్వరలో ఆ సినిమాలు కూడా పట్టాలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్తగా పూరి జగన్ చూపు విజయ్ దేవరకొండ వైపు పడింది, పూరితో సినిమా అంటే ఒకప్పుడు హీరోలు ఎగిరి గంతేసేవారు. పక్కా కమర్షియల్ ఫార్ములాతో మినిమమ్ గ్యారంటీ సినిమా మూడు నెలలో తీసి నిర్మాత చేతిలో పెడతాడు.

Puri Jagannath

అలాంటి పూరి ఈ మధ్య చేస్తున్న ఒక్క సినిమా కూడా సరైన హిట్ అందుకోక పోగా, జ్యోతిలక్ష్మి, మెహబూబా లాంటి డిజాస్టర్స్ సినిమాలు తీసి నమ్మకం కోల్పోయాడు. కానీ పూరి జగన్ మాత్రం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాల మధ్యలో చిన్న గ్యాప్ దొరికితే మంచి కమర్షియల్ ఫార్ములాతో చక చక ఒక సినిమా చుట్టేయాలని ఉబలాటపడుతున్నట్లు తెలుస్తుంది. దానికి గాను పూరి గురువు రామ్ గోపాల్ వర్మ సహాయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండకు సినిమాల పరంగా వర్మ కొంత సహాయం చేసాడు. ఆ చనువుతో పూరి సినిమాకు లైన్ క్లియర్ చేసేందుకు వర్మ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.

సూపర్ ఫార్మ్ లో ఉన్న విజయ్ దేవరకొండ డిజాస్టర్స్ వైపు పరుగులు తీస్తున్న పూరి సినిమాను ఒప్పుకుంటాడా అనేది కొంత ఆసక్తికరంగా ఉంది. పూరి జగన్ కనుక సినిమాపై సరిగ్గా దృష్టి పెడితే ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసే సినిమాను చేసే సత్తా ఉంది. కానీ పూరి ఎంత సేపటికి తాను రాసుకున్న కథలపై మాత్రమే సినిమాలు తీస్తూ తప్పటడుగులు వేస్తున్నాడు. ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ సినిమా రచయిత వక్కంత వంశీ అందించిన కథతో దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అలా బయట రచయితల కథతో కనుక పూరి సినిమా చేయగలిగితే విజయ్ దేవరకొండకు మరో బ్లాక్ బస్టర్ అందిస్తాడనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.