‘గీత గోవిందం’ చిత్రాన్ని తన సినిమా నుంచి కాపీ కొట్టారంటున్నారు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రం మంచి హిట్ అయినా సంగతి తెలిసిందే. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు కూడా సమాచారం. ఈ సినిమాకు పరశురామ్‌ దర్శకత్వం వహించాడు. ఇటీవల సంతోషం సినిమా అవార్డ్స్‌ కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎందరో సినీ ప్రముఖులు హాజరవగా.. రాఘవేంద్రరావు కూడా ఈ వేడుకకు వెళ్లారు.

అక్కడి స్టేజ్‌పై ‘గీత గోవిందం’ సినిమా గురించి ప్రస్తావించిన రాఘవేంద్రరావు… తాను తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ సినిమాను కాపీ కొట్టి ఈ చిత్రాన్ని పరశురామ్‌ తెరకెక్కించారని చమత్కరించారు. 20 ఏళ్ల క్రితం నేను, అల్లు అరవింద్‌ ‘పెళ్లి సందడి’ సినిమాను తెరకెక్కించాం. ‘గీత గోవిందం’ సినిమా చూశాక నాకు ‘పెళ్లి సందడి’ రోజులు గుర్తుకు వచ్చాయన్న ఆయన.. ఒక్క ముద్దు సన్నివేశం లేకుండా సినిమాను తెరకెక్కించడం ఈరోజుల్లో అసంభవం అన్నారు. ఏ విషయంలోనూ రాజీపడకుండా దర్శకుడు పరశురామ్‌ ఇంత మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించినందుకు అతనికి శుభాకాంక్షలు తెలిపారు రాఘవేంద్రరావు.