అల్లు అర్జున్ ఎంతో నమ్మకం పెట్టుకున్న “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా ప్లాప్ అవ్వడంతో గత ఆరు నెలలుగా సరైన స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నాడు. దర్శకుడు విక్రమ్ చెప్పిన లైన్ ఒకే చేసిన అల్లు అర్జున్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి అల్లు అర్జున్ వద్దకు తీసుకొని వెళ్ళగా అల్లు అర్జున్ కు, మొదటి అర్ధభాగం నచ్చి, రెండవ అర్ధ భాగం నచ్చకపోవడంతో ఏకంగా స్క్రిప్ట్ తో పాటు డైరెక్టర్ ను కూడా పక్కన పెట్టి త్రివిక్రమ్ ను లైన్లో పెట్టాడు.

గతంలో త్రివిక్రమ్ చెప్పిన లైన్ కు హీరోలు ఒకే చేసి, త్రివిక్రమ్ మాయలో పడి త్రివిక్రమ్ ను ఫాలో అవుతు, అతనిపై నమ్మకం పెట్టి గుడ్డిగా సినిమా చేసేవారు. కానీ ఈ మధ్య త్రివిక్రమ్ మాటలతో పాటు, తన డైరెక్టన్ లో పదును తగ్గిందనడానికి, గత రెండు చిత్రాలే నిదర్శనం. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన “అజ్ఞాతవాసి” సినిమా అయితే డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, ఎన్టీఆర్ తో చేసిన “అరవింద సమేత” రాయలసీమ యాసతో సినిమాను పర్లేదన్నట్లు నెట్టుకొచ్చాడు. ఈ సినిమా కొన్న బయ్యర్లుకు బ్రేక్ ఈవెన్ కాలేదన్న సంగతి తెలిసిందే. అందుకే అల్లు అర్జున్ కూడా ఇప్పుడు త్రివిక్రమ్ ను గుడ్డిగా నమ్మకుండా త్రివిక్రమ్ చెప్పిన లైన్ పూర్తిగా డెవలప్ చేసిన తరువాత సినిమా షూటింగ్ మొదలుపెడదామని చెప్పినట్లు తెలుస్తుంది.

త్రివిక్రమ్ మాయ నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చి, ఈ సారి ఎలా అయినా తన సినిమా హిట్ ట్రాక్ ఎక్కించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు. ఈ మధ్య అల్లు అర్జున్ తన దగ్గరకు వచ్చిన కథలను ఎంపిక చేసేందుకు స్క్రిప్ట్ సెలక్షన్ టీమ్ ను కూడా నియమించుకున్నాడు. ఈ టీమ్ ఫైనల్ చేసిన తరువాతే అల్లు అర్జున్ సినిమా పట్టాలెక్కుతుందని చెబుతున్నారు. ఈ లెక్కన త్రివిక్రం పూర్తి స్క్రిప్ట్ తో వచ్చి అల్లు అర్జున్ ను ఇంప్రెస్స్ చేస్తాడో లేక విక్రమ్ కుమార్ లా సైడ్ జరుగుతాడో చూడాలి.