అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టాలని, రాజకీయబిక్ష పెట్టిన జగన్‌కు వెన్నుపోటు పొడవాలని ప్రయత్నించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వాపును చూసి బలుపు అనుకున్న కోటంరెడ్డికి ఇప్పుడు వాస్తవ చిత్ర బోధపడుతున్నది. నెల్లూరు రూరల్‌లో నేనే వైసీపీ, వైసీపీనే నేను అని భ్రమపడిన ఆయనకు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తున్నది. తాను వైసీపీ నుంచి బయటకు వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం పార్టీ క్యాడర్, ప్రజా ప్రతినిధులు అందరూ తనతో పాటే బయటకు వచ్చేస్తారని కోటంరెడ్డి భ్రమించారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
కోటంరెడ్డి సంగతి బయటపడగానే ముఖ్యమంత్రి జగన్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన చేస్తున్న మోసాన్ని గ్రహించారు. వెంటనే నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారని చెప్పేశారు. దీంతో ఆదాల నెల్లూరు రూరల్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. అప్పుడే పని ప్రారంభించారు. పార్టీ క్యాడర్‌కు భరోసా ఇస్తున్నారు. దీంతో కోటంరెడ్డి వెంట వెళ్తారనుకున్న వారు ఒక్కొక్కరుగా ఆయనకు షాక్ ఇస్తున్నారు. తాము వైసీపీలోనే ఉంటామని ప్రకటిస్తున్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరంతా తన వెంటే ఉంటారని కోటంరెడ్డి భావించారు. ఒక్క కార్పొరేటర్ కూడా వైసీపీలో ఉండొద్దనేలా స్కెచ్ వేశారు. కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి తాను వైసీపీలోనే ఉంటానని చెప్పగానే ఆయనపై దౌర్జన్యం జరిగింది. భయంతోనో, భక్తితోనో కార్పొరేటర్లు అందరూ తన వెంట వచ్చేలా చూసుకోవాలని కోటంరెడ్డి స్కెచ్ వేశారు. కానీ, ఆయన ఆశలు ఫలించడం లేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇప్పటికే 18 మంది కార్పొరేటర్లు జై కొట్టారు. తాము వైసీపీ టిక్కెట్ మీద గెలిచామని, వైసీపీలోనే ఉంటామని ప్రకటించారు.
మరో ఆరుగురు కార్పొరేటర్లు కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కోటంరెడ్డి వెంట నడిచే కార్పొరేటర్ల సంఖ్య కేవలం ఇద్దరికి పడిపోయింది. కార్పొరేటర్లే కాదు.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్‌పీటీసీలు కూడా కోటంరెడ్డి వెంట వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. వైసీపీ గుర్తు మీద, జగన్ ఫోటో పెట్టుకొని గెలిచిన తాము వైసీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేస్తున్నారు. దీంతో కోటంరెడ్డికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆయన రోజూ ప్రెస్ మీట్ పెట్టి, లేఖలు రాస్తూ, వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తూ ఈ ప్రస్ట్రెషన్‌ను తీర్చుకుంటున్నారు.
ఇక నుంచి పూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని, వైసీపీ నేతలకు అందుబాటులో ఉండాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఆయన వారికి కూడా చెప్తున్నారు. కోటంరెడ్డికి, ఆయన రౌడీమూకలకు భయపడొద్దని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇస్తున్న భరోసా ఫలిస్తున్నది. తన వెంట నడుస్తారనుకున్న నేతలే వరుసగా షాక్‌లు ఇస్తుండటంతో ఏం చేయాలో కోటంరెడ్డికి పాలుపోవడం లేదు.