వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికలకు మించిన విజయాన్ని సాధించాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలగా ఉన్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి ఆయన పూర్తి స్పష్టతతో ఉన్నారు. ఏయే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఆ నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయి ? అభ్యర్థి ఎవరైతే అక్కడ విజయం సాధిస్తారు ? వంటి అంశాలపై జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ దిశగా ఇప్పటినుంచే ఆయన అంతర్గతంగా అభ్యర్థులు ఎవరనేది చెప్పకనే చెప్తున్నారు.
టిక్కెట్లు దక్కని వారిని సైతం కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో ఫలానా కారణాల వల్ల మీకు టిక్కెట్ ఇవ్వడం కుదరడం లేదు. మరో పదవి ద్వారా మీకు న్యాయం చేస్తాను అని జగన్ వారికి మాటిస్తున్నారు. ఇలా ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు జగన్ నుంచి స్పష్టమైన సందేశాలు అందాయని సమాచారం. ఈ లిస్టులో గాజువాక నుంచి గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదనే విజయం సాధించిన తిప్పల నాగిరెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది. వివిధ సామాజకవర్గ సమీకరణాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడం కుదరదని నాగిరెడ్డికి జగన్ నచ్చజెప్పారు.
ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తగిన గౌరవాన్ని ఇస్తానని సైతం నాగిరెడ్డికి జగన్ నచ్చజెప్పారు. ఈ విషయాన్ని నాగిరెడ్డి కూడా నిజమేనని ఒప్పుకున్నారు. నిజానికి నాగిరెడ్డి సౌమ్యుడు, మంచివాడిగా గాజువాక ప్రజల్లో పేరుంది. గతంలో ఆయన కార్పొరేటర్‌గా కూడా పని చేశారు. అప్పటి నుంచి ప్రజల్లో ఉండేవారు. ఈ పేరు వల్లే ఆయన పవన్ కళ్యాణ్‌ను సైతం ఒడించగలిగారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయడానికి ప్రధాన కారణం కాపు సామాజకవర్గం ఇక్కడ బలంగా ఉండటమే.
తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ విజయానికి శక్తివంచన లేకుండా కష్టపడింది. పైకి పొత్తు లేకపోయినా పరోక్షంగా పవన్ విజయానికి చంద్రబాబు కృషి చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పోటీ చేశారు. ఆయన కోసం చంద్రబాబు కనీసం ప్రచారం కూడా చేయకుండా పరోక్షంగా పవన్ కళ్యాణ్ విజయానికి మద్దతు ఇచ్చారు.
ఈసారి తెలుగుదేశం, జనసేన పొత్తు ఉండబోతున్నది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ మళ్లీ గాజువాక నుంచి పోటీ చేయాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ డైలమాలో పడ్డారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మీడియాలో కామెంట్స్ చేశారు. 2019లో చంద్రబాబు ప్రచారం చేయనందుకే ఓడిపోయానని చెప్పారు. పరోక్షంగా అప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారని పల్లా శ్రీనివాస్ కుండబద్దలు కొట్టారు.
2024లో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు గాజువాక సీటు ఇస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించని ప్రకటించారు. ఒకవైపు తిప్పల నాగిరెడ్డికి టిక్కెట్ ఇవ్వనని జగన్ చెప్పిన సమయంలోనే పల్లా శ్రీనివాస్ టీడీపీపై తిరుగుబావుటా ఎగరేయడంతో గాజువాక పాలిటిక్స్ హాట్‌హాట్‌గా మారిపోయాయి. నాగిరెడ్డికి టిక్కెట్ ఇవ్వనని చెప్పిన జగన్ ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నారు ? టీడీపీపైన అసంతృప్తిగా ఉన్న పల్లా శ్రీనివాస్ వైసీపీ తరపున పోటీ చేయనున్నారా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. త్వరలోనే ఈ విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.