నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీ పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. ఇది క్షణంలో అయిన బయటపడవచ్చని ఇప్పటి నుంచే వారు ఓ అంచనాకు కూడా వచ్చేశారు. రాయలసీమ జిల్లాల తరువాత వైసీపీకి అంతటి పట్టున్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఖచ్చింతంగా నెల్లూరు జిల్లానే అని చెప్పాలి. జగన్ వైసీపీ పార్టీ స్థాపించిన తరువాత జిల్లా ప్రజలు.. ఆయనకు అండగా నిలిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలతో పాటు, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీకే మద్దతుగా నిలిచారు జిల్లా ప్రజలు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో అయితే మొత్తం అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకే పట్టం కట్టారు. దీంతో జిల్లాలో అధికార పార్టీకి ఎదురు లేకుండా పోయింది. కాని గత కొంతకాలంగా జిల్లాలో అధికార పార్టీ తీవ్ర అధిపత్యపోరును ఎదుర్కొంటుంది.
ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి , మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు మధ్య గ్యాప్ ఉందని చాలానే ఘటనలు రుజువు చేశాయి. అయితే వీరిద్దరు కూడా ఎప్పుడు పార్టీ గీత దాటింది లేదు. కాని పార్టీ సీనియర్ నేత అయిన ఆనం రాంనారాయణరెడ్డి తన పరిధిని దాటి మాట్లాడి.. పార్టీ పరువును బజారున పడేశారు. ఆనం వ్యాఖ్యలపై జగన్ చాలా సీరియస్‌గానే తీసుకున్నారట. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తెలుస్తోంది. అటు ఆనం కూడా వైసీపీలో తనకు టికెట్ రాదని ముందే గ్రహించారని తెలుస్తోంది. ఆనం చాప్టర్ వైసీపీలో దాదాపు క్లోజ్ అయినట్లే అని అందరు కూడా చర్చించుకుంటున్నారు. ఆనం తిరిగి టీడీపీలో చేరాలని చూస్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని సమాచారం అందుతుంది.
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీని వీడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆనం తరుఫున నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి జగన్‌కు రాయభారం కూడా పంపించారట. ఆనం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో..నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీని వీడటానికి సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. వీరితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా చాలా కాలంగా వైసీపీ హైకమాండ్ పైఅసంతృప్తిగా ఉన్నారు. లిక్కర్ స్కాంలో తనకు ఎటువంటి సాయం అందలేదనే ఆగ్రహంతోనే ఆయన వైసీపీని వీడుతున్నారని సమాచారం అందుతుంది. మరి వీరు కనుక పార్టీని వీడితే.. ఎలాంటి నష్టం చేసి వెళ్తారో చూడాలి. ఇదే సమయంలో వీరి స్థానంలో ఎవరికి అవకాశం కల్పిస్తారా కూడా చూడాల్సి ఉంది.