ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకోదగిన స్థానం విజయవాడ. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత విజయవాడ లోక్‌సభ స్థానానికి పదిసార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు ఆ పార్టీనే విజయం సాధించింది. గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి కేశినేని నాని ఇక్కడ విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ హవా నడిచినా విజయవాడ సీటును మాత్రం వైసీపీ 8 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది. 2014లోనూ వైసీపీ 70 వేల ఓట్ల తేడాతో ఓడింది. ఇక్కడ ఎంత కష్టపడ్డా కూడా గెలుపు కోసం కావాల్సిన ఓట్లను వైసీపీ పొందలేకపోతున్నది.
ఈ పార్లమెంటు సీటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓడిపోతున్నా పార్లమెంటు స్థానాన్ని మాత్రం కైవసం చేసుకుంటున్నది. 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటులోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదింట వైసీపీ విజయం సాధించింది. కేవలం విజయవాడ తూర్పులో మాత్రమే ఓడిపోయింది. ఈ లెక్కన విజయవాడ లోక్‌సభ స్థానంలో వైసీపీ ఘన విజయం సాధించాలి. కానీ, ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఈ పార్లమెంటు స్థానాన్ని దక్కించుకునే దిశగా వైసీపీ పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే జగన్ ఈ టిక్కెట్ విషయమై సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
విజయవాడ పార్లమెంటు పరిధిలో దళితుల ఓట్లు దాదాపు 3 లక్షలకు పైగానే ఉంటాయి. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా దళితులు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా వారు విజయవాడ ఎంపీ కాలేకపోయారు. గత నలభై ఏళ్లుగా ఇక్కడి నుంచి కమ్మ సామాజకవర్గానికి చెందిన వారే ఎంపీలుగా గెలుస్తున్నారు. అంతకుముందు కూడా కమ్మ, బ్రాహ్మణ సామాజకవర్గాల వారే ప్రాతినిధ్యం వహించారు. ఒకరకంగా చెప్పాలంటే విజయవాడ ఎంపీ సీటు అగ్రవర్ణాలకు, ప్రత్యేకించి కమ్మ సామాజకవర్గానికి పెట్టని కోటలా మారిపోయింది.
దళితుల ఓట్లు ఇంత భారీ సంఖ్యలో ఉన్నా వారికి మాత్రం ఇక్కడి నుంచి అవకాశం దొరకడం లేదు. కాబట్టి, మొట్టమొదటి సారిగా ఇక్కడి నుంచి దళితులను పోటీకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా మొదటిసారిగా విజయవాడకు ఒక దళితుడిని పార్లమెంటు సభ్యుడిగా చేసి సామాజకన్యాయం పాటించినట్టు అవుతుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే విజయవాడ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.
దళితుల నుంచి అభ్యర్థిగా ఎవరిని పోటీకి నిలపాలనే అంశంపై కూడా ముఖ్యమంత్రి జగన్ ఒక ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీని పోటీలో నిలిపితే బాగుంటుందనే ఆలోచన వైసీపీలో ఉన్నట్లు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడుగా పేరున్న సదరు ఎంపీ ఉన్నత విద్యావంతుడు కావడం కూడా పార్టీ ఆయన పట్ల మొగ్గు చూపడానికి కారణంగా కనిపిస్తోంది. ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదులుకొని మరీ పార్టీ కోసం పని చేసిన సదరు నేత ఈ సీటుకు పోటీ చేస్తే బాగుంటుందనే ఆలోచన వైసీపీలోని కొందరు ముఖ్య నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ కనుక సదరు దళిత నేతను విజయవాడ ఎంపీగా వైసీపీ బరిలో నిలిపితే సంచలనంగానే చెప్పుకోవాలి. ఇంత వరకు దళితులకు ప్రాతినిధ్యం లేని, 40 ఏళ్లుగా ఆగ్రవర్ణాలే ఎంపీగా ఉన్న నియోజకవర్గంలో దళితుడిని నిలపడం అంటే కచ్చితంగా అది ధైర్యమే. సామాజక న్యాయాన్ని నిజం చేసినట్లవుతుంది. ఇక, దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నందున గెలుపు కూడా సులువే అవుతుంది. ఇదే జరిగితే టీడీపీ కంచుకోట ఈసారి బద్దలు కావడం ఖాయం.