ఈ కామర్స్ సంస్థలు దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని ఆఫర్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దిగ్గజ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ 5 రోజుల్లోనే రూ.15,000 కోట్ల మేర అమ్మకాలు జరిపి ఉంటాయని అంచనా. స్మార్ట్‌ఫోన్లు, రిఫ్రిజరేటర్లు, వాషింగ్‌మెషీన్లు, ఏసీల వంటి మన్నికైన వినియోగ ఉత్పత్తులు, దుస్తుల విక్రయాలు భారీగా జరిగినట్లు ఆయా సంస్థలు వెల్లడిస్తున్నాయి. 2017 పండుగ సీజన్‌లో ఈ కామర్స్‌ పోర్టళ్ల అమ్మకాలు 1.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10,325 కోట్ల) మేర జరిగాయి. ఈనెల 9-14 తేదీల్లో 2 బిలియన్‌ డాలర్లకు పైగా (సుమారు రూ.15,000 కోట్ల) జరిగినట్లు అంచనా. అంటే ఈసారి 64 శాతం వృద్ధి లభించిందని రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ నివేదిక అంచనా వేసింది.

గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరిట జరిపిన విక్రయాల్లో అమెజాన్ భారీ వృద్ధి కనబరిచినట్లు తెలియజేసింది. గతేడాది జరిగిన కొనుగోళ్ల సంఖ్యను, ఈ ఏడాది 36 గంటల్లోనే అధిగమించామన్న అమెజాన్.. అన్ని విభాగాల్లో అంచనాలను మించి అమ్మకాలు జరిపామని తెలియజేసింది. తొలిసారిగా అమెజాన్ పోర్టల్‌లో కొనుగోళ్లు జరిపిన వారిలో 80% మంది చిన్న పట్టణాల నుంచే ఉన్నారు. హిందీ భాషలో రూపొందించిన అమెజాన్‌ వెబ్‌సైట్‌పై, సాధారణ రోజుల ఖాతాదార్లతో పోలిస్తే, 2.4 రెట్లు అధికంగా కొత్త ఖాతాదారులు కొనుగోళ్లు జరిపారు.

అలాగే మరో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో దేశీయ రిటైల్‌ రంగంలో ప్రస్తుతం ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకు పోయేలా బిగ్‌బిలియన్‌ డేస్‌ అమ్మకాలు సాగాయి. ఈ 5 రోజుల్లో ఈ కామర్స్ పోర్టళ్లు జరిపిన అమ్మకాల్లో 70% వాటా మాదే అని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ప్రతి 4 స్మార్ట్‌ఫోన్లలో 3 మా ప్లాట్‌ఫాం నుంచే అమ్ముడయ్యాయని ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.. కొత్త ఖాతాదారుల పరంగా 50% వృద్ధి లభించిందని తెలియజేసింది.