సామాన్య మానవుడు రోడ్డు మీదకు రావాలంటే భయపడుతున్న రోజులకు మనల్ని పాలించే పాలకులు కలగచేస్తున్నారు. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలలో అయితే రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. కొత్త రోడ్డు వేసిన ఆరునెలలు తిరిగే సరికి ఆరోడ్డు యధాస్థితికి వచ్చి ప్రజల వెన్నుపూసలు విరగొడుతున్నారు. వర్షం పడిన రోజైతే ఇక ఎక్కడ గోతి ఉందొ, ఎక్కడ నాలా తెరుచుకొని ఉందొ కనపడక బిక్కుబిక్కుమంటూ ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి నెలకొంది.

దీనిలో భాగంగానే కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఒక పెద్ద గుంత పడింది. దానిని పూడ్చి బాగు చేయాలనీ ఎన్ని సార్లు అధికారులను ప్రజలు వేడుకున్నా ఆ వైపు చుసిన పాపాన పోలేదు. ప్రజలు కూడా ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని, జాగ్రత్తగా చూసుకొని ఆ ప్రాంతంలో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆ ప్రాంతంలోకి తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లడం జరిగింది. ఆ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. ఏమిటి ఈ కుదుపు అని ఆరా తీసి ఆ గోతి సంగతి తెలుసుకున్నారు.

ప్రధాన రహదారిపై ఇంత పెద్ద గుంత ఉందా అని తెలుసుకొని ఆశ్చర్యపోయి, అధికారులపై గట్టిగానే ఫైర్ అయ్యారు. దీనితో అధికారులు రంగంలోకి దిగి చక చకా రిపేర్లు చేయడానికి పూనుకున్నారట. మంత్రి గారు రోడెక్కి ప్రయాణిస్తే గాని అధికారులకు చలనం రాలేదు. ఈ సంఘటన తరువాత చాల మంది ప్రజలు అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా రోడ్లు వేయకపోవడంతో ఒక్క సారి మా ఏరియాకు మంత్రి గారు వస్తే మా రోడ్లే దుస్థితి ఏమిటో తెలుస్తుందని వాపోతున్నారు. అధికారులు సక్రమంగా బాధ్యతలు నెరవేర్చకుండా మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రయాణించే సమయంలో మాత్రమే రోడ్లవైపు చూస్తుంటే ప్రజలలో అసహనం పెరగకుండా ఎలా ఉంటుంది. అసలే ఎన్నికల సీజన్ ముంచుకొస్తుంది. ఇలాంటివన్నీ అధికారులు జాగ్రత్తగా చూసుకోవాలి కదా? అయిన మాకెందుకులే తరువాత ఏ ప్రభుత్వం వస్తుందో అని ఫీల్ అవుతున్నారో లేక, అలసత్వం వహిస్తున్నారో ఆ అధికారులకే ఎరుక.