ముఖ్యమంత్రి కేసీఆర్ తన నాలుగునర్ర ఏళ్ళ పాలనకు సంబంధించి ప్రజలకు ఎలాంటి మేలు చేకూర్చానో అని చెప్పడానికి ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు జనం భారీగా తరలి వస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి ప్రజలు ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో బయలు దేరారు. ఎంపీ పొంగులేటి ఆధ్వర్యంలో 1800 ట్రాక్టర్లతో బయలు దేరిన ప్రజలు ఈరోజు సాయంత్రానికి సభ ప్రాంగణానికి చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం మొదలయ్యే సభకు ఈరోజే జనం సభ స్థలానికి చేరుకుంటున్నారంటే సభ ఎంతలా సక్సెస్ చేయడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందో తెలుస్తుంది.

ఇక రేపు సభ వేదిక నుంచే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించే సూచనలు ఉన్నాయని టిఆర్ఎస్ వర్గాలు తెలియచేస్తున్నాయి. అందుకే ఈరోజు మధ్యాహ్నం ముందుగా మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని, గవర్నర్ ను కలసి అసెంబ్లీ రద్దుకై సిపార్సు చేస్తారని, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం ఛత్తీస్ గడ్ తో పాటే ఎన్నికలు వెళ్లాలని భావిస్తున్నట్లు కనపడుతుంది. డిసెంబర్ లో ఆ నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న వేళ, ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే అప్పటికి ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యమవుతుందని ఇప్పటికే ఎన్నికల సంఘం టిఆర్ఎస్ ప్రభుత్వానికి సూచనప్రాయంగా తెలియచేసినట్లు తెలుస్తుంది.