అధికార వైసీపీ పార్టీలో తీవ్ర సంక్షోభం నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి పార్టీలో అనిశ్చితి కనిపిస్తోంది. జగన్ వైసీపీ స్థాపించిన తరువాత చాలానే అటుపోట్లను ఎదుర్కొన్నారు. వాటిన్నింటిని కూడా తట్టుకుని ముందుకు సాగారు జగన్. మొండిగా ముందుకు వెళ్లడంతోనే జగన్ ఈ రోజున సీఎం కాగలిగారని చాలామంది నమ్ముతుంటారు. జగన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా నాయకులందరు కూడా ఆయన మాట జవదాటింది లేదు. కాని గడిచిన కొద్ది రోజులుగా వైసీపీలో తీవ్ర సంక్షోభం కనిపిస్తుంది. వరుస పెట్టి నాయకుల తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. టికెట్ దక్కదనో లేక.. తమకు ప్రాధాన్యత దక్కడం లేదని కారణామో తెలియదు కాని.. కొందరు ఎమ్మెల్యేలు తమకు నచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఆనం రాం నారాయణరెడ్డి, మేకతోటి సుచరిత, జోగి రమేష్, శ్రీదేవి, కాకాణి గోవర్థన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కరణం బలరాం , ఆమంచి కృష్ణమోహన్ , మద్దిశెట్టి వేణుగోపాల్ మొదలగు వారందరు కూడా సొంత పార్టీపై కాని.. తోటి ఎమ్మెల్యేలపై కాని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. వీరందరి వల్ల పార్టీ కార్యకర్తలు చాలానే ఇబ్బంది పడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా మేకతోటి సుచరిత తన భర్త పార్టీ మారితే.. తాను కూడా మారాల్సి వస్తుందని చెప్పి సంచలనం సృష్టించారు. దాదాపు ఆమె వైసీపీ వీడినట్లే అని పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరొ వైసీపీ ఎమ్మెల్యే తాజాగా చేసిన కామెంట్స్‌ను బట్టి చూస్తే..ఆయన కూడా పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది. మైలవరంలో నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ వైసీపీలో తీవ్ర చర్చకు దారి తీసింది. తాజాగా చంద్రబాబు సభకు వచ్చి గుంటూరులో ముగ్గురు మహిళలు చనిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సభకు ఏర్పాట్లు చేసిన ఉయ్యూరు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉయ్యూరు శ్రీనివాస్‌ను వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెనకేసుకొచ్చారు.
ఉయ్యూరు శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి అని..గతంలో కూడా ఆయన చాలా మంచి పనులు చేసేవారని కితాబిచ్చారు. ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి మిత్రుడని వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎన్ఆర్ఐలు వాళ్ల పని వాళ్లు చేసుకునేలా చూడాలని కోరారు. ఎన్ఆర్ఐలు వాళ్ల పని వాళ్లు చేసుకోవాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, ఇది సరికాదని వైసీపీ నేతలకే వసంత కృష్ణప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ఇది సరికాదని, ఇలా చేస్తే అభివృద్ధిని ఆపడమే అవుతుందని అన్నారు. రాజకీయ వేదికపైకి వచ్చారనే ఉయ్యూరు శ్రీనివాస్ పై పనికి రాని రాద్ధాంతం చేస్తున్నారని వసంత కృష్ణప్రసాద్ మండి పడ్డారు. సేవా కార్యక్రమాలు చేయబోయి ఉయ్యూరు శ్రీనివాస్ కష్టాలు పడుతున్నారని అభిప్రాయపడ్డారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ ఇలా టీడీపీ నేతకు అనుకులంగా మాట్లాడటంపై వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్‌తో తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారాయన. ఇటీవలే జగన్‌తో మాట్లాడి .. తన నియోజకవర్గంలో అధిపత్య పోరును కూడా వివరించి పరిష్కరించుకున్నారు. ఇలాంటి తరుణంలో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నేతకు అనుకులంగా మాట్లాడటం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది.