అధికార వైసీపీ పార్టీలో తీవ్ర సంక్షోభం రాబోతుందా అంటే…. ? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీ కీలక నాయకురాలు, మాజీ హోం మంత్రి, జగన్‌కు అత్యంత ఆప్తురాలు అయిన మేకతోటి సుచరిత భర్త టీడీపీలో చేరుతున్నారనే వార్త ఈ మధ్య బాగా ప్రచారం అవుతుంది. ఈ ప్రచారంపై అటు పార్టీ కాని.. ఇటు మేకతోటి సుచరిత కాని స్పందించింది లేదు. పైగా ఇటీవలే పార్టీలోని ఉన్నత పదవులకు ఆమె రాజీనామా చేసింది. దీంతో మేకతోటి సుచరిత భర్త టీడీపీలో చేరుతున్నారనే ప్రచారానికి బలం చేకురినట్లు అవుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… మేకతోటి సుచరిత వైసీపీ పార్టీకి దూరం అవుతున్నట్లుగానే కనిపిస్తుంది.
గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలన్ని కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయని..మేకతోటి సుచరిత అనుచరులు వాపోతున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న తమకు అన్యాయం చేస్తున్నారని.. తమపై పార్టీ అధినాయకత్వం వివక్ష చూపిస్తున్నారని మేకతోటి వర్గం భావిస్తోంది. దీనితో పాటు.. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో చేరిన వారికి ..అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా మేకతోటికి నచ్చడం లేదట. ఈ కారణాలతోనే మేకతోటి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌పై ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు దిగుతుందని ఆ వర్గం ఆరోపిస్తున్నారు.
మేకతోటి సుచరిత భర్త దయాసాగర్ ఇన్‌కంట్యాక్స్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇటీవల పదవీ విరమణ చివరి దశలో విజయవాడ కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. ఆ సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే వేరే రాష్ట్రానికి బదిలీ చేశారు. దీని వెనుక వైసీపీ ఎంపీ హస్తం ఉన్నట్లు మేకతోటి వర్గం ఆరోపిస్తోంది. పార్టీలో కావాలనే తమను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని మేకతోటి సుచరిత భావిస్తున్నారట. అందుకే ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉండాలని కూడా చూస్తున్నారట. ఇదే కనుక జరిగితే వైసీపీ పార్టీకి ఖచ్చితంగా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి.
ఇటు మేకతోటి సుచరిత భర్త దయాసాగర్ ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొదట వైసీపీ నుంచి పోటీ చేయలని చూసినప్పటికి.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూసిన తరువాత.. ఆయన మనస్సు టీడీపీ వైపు మళ్లినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా టీడీపీ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారట. ఇప్పటికే మేకతోటి సుచరిత భర్త దయాసాగర్ టీడీపీ నాయకులతో టచ్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే.. సుచరిత రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. సుచరిత రాజకీయ జీవితం ఎటువైపు పయనిస్తుందో చూడాలి.