సీఎం జగన్ వ్యహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎన్నికల దగ్గర పడే కొద్ది ఆయనలోని రాజకీయ నాయకుడు బయటకు వస్తున్నారు. గడిచిన మూడేళ్లలో కేవలం పరిపాలనకు మాత్రమే పరిమితం అయిన జగన్.. ప్రస్తుతం రెండేళ్లు మాత్రం పార్టీ సంస్థాగత పాలన మీద దృష్టి సారించారు. ఎట్టి పరిస్థుతుల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. నాయకులుపై ప్రజలు ఎలాంటి భావనతో ఉంటున్నారు అనే దానిపై సమీక్షలతో కూడిన సర్వేలు చేయించుకుంటున్నారు.
ఇప్పటికే వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న నవరత్నాలు ప్రజలకు చేరువైయ్యాయి. ఇప్పుడు ఆయన ప్రజలకు మరింత దగ్గర కావాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే జగన్ ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలు తమ సమస్యలను చెప్పుకొనే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే గడపగపడకు ప్రభుత్వం పేరుతో పథకాల లబ్ది దారుల ఇంటికి మంత్రులు – ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. అయినప్పటికి కూడా సంతృప్తి చెందని సీఎం.. ఈ ఆలోచనను తెర మీదకు తీసుకువచ్చినట్లుగా సమాచారం అందుతుంది.
తాడేపల్లి సీఎం కార్యాలయం పర్యవేక్షణలో ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి రంగం సిద్దం అవుతుంది. దీనికి ఓ నెంబర్ ను ప్రకటించనున్నారు.ఈ నెంబర్‌కు ఎవరైనా నేరుగా ఫిర్యాదు, సమాచారం ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం పేరును “జగనన్నకు చెబుదాం”గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో లబ్ది దారులకు నేరుగా ఫోన్లు చేసి వారికి అందుతున్న పథకాలను అందించటంతో పాటుగా వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారట. తద్వారా ప్రజల్లో తమ పాలనపై ఎలాంటి స్పందన ఉందనేది జగన్ ఆలోచన. లబ్ది దారులతో తానే స్వయంగా మట్లాడటం .. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవటం ద్వారా క్షేత్ర స్థాయిలో పథకాల అమలు మరింత పక్కాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ప్రజలతో నేరుగా ఫోన్ కాల్ కార్యక్రమం ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి.