Sunday, October 13, 2024

CONGRESS: తెలంగాణ తెరపైకి మరో బీసీ పార్టీ..కాంగ్రెస్ కు కష్టమే

- Advertisement -

CONGRESS: తెలంగాణలో మరో కొత్త పార్టీ అవతరించనుందా? బీసీ నినాదంతో తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? వివిధ పార్టీల్లోని బీసీ నేతలే ఏకతాటిపైకి రానున్నారా? అంటే అవననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన కృష్ణయ్య మరోసారి బీసీ నినాదంతో పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు మారే అవకాశం ఉంది. బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయని.. తప్పకుండా పార్టీ పెడతామని ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ పార్టీ పెట్టాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో పరిశీలనలో ఉందని.. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఆదివారం రోజున.. అఖిలపక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించగా.. ఈ సదస్సుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు, పలువురు బీసీ కులసంఘాల నాయకులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో మాట్లాడిన ఆర్ కృష్ణయ్య.. గతంలో 10 మంది బీసీ నాయకులు పార్టీ పెట్టినా విజయవంతం కాలేకపోయారని.. ఈసారి తాము మాత్రం సరైన సమయం చూసి పెడతామని ప్రకటించారు. మరోవైపు.. కాంగెస్ ప్రభుత్వం.. తెలంగాణలో సమగ్ర కుల గణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. గతంలో బీసీల పోరాటాన్ని వక్రీకరించారన్నారు. ఈసారి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు సాధించుకోకపోతే.. అసలు రిజర్వషన్లే లేకుండా చేస్తారని హెచ్చరించారు.

కులగణన విషయంలో ప్రభుత్వం జీవో ఇస్తే.. మళ్లీ హైకోర్టుకు వెళ్లే ప్రమాదం ఉందని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే.. ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని.. ముందుచూపుతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్లోని స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో దాఖలైన అన్ని కేసుల్లో బీసీలకు వ్యతిరేకమైన తీర్పే వచ్చిందని గుర్తు చేసిన కృష్ణయ్య.. తెలంగాణలోనూ అలాంటి ప్రమాదం ఉందని తెలిపారు. అవసరమైతే.. రాష్ట్రంలో బంద్ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు.తెలంగాణలో మరో భారీ ఉద్యమం వస్తే తప్ప రిజర్వేషన్లు సాధ్యం కావని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. త్వరలో నిర్వహించబోయే సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం భారీ ఉద్యమమే రాబోతుందని కృష్ణయ్య చెప్పుకొచ్చారు. ఆ ఉద్యమ సెగ కేంద్ర ప్రభుత్వానికి కూడా తాకబోతుందని ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఆయన సంకేతాలు ఇవ్వడం విశేషం.

ఒక వేళ తెలంగాణలో మరో పార్టీ ఏర్పాటైతే మాత్రం అది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నోరకాల హామీలు ఇచ్చింది. వాటిని అమలుచేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది. దీంతో ప్రభుత్వంపై ఒక రకమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా బీసీ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. తెలంగాణాకు చివరి ఓసీ సీఎం రేవంత్ అని కాంగ్రెస్ బీసీ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ హామీ అమలుకాకపోయినా.. రాష్ట్రంలో మరో బీసీ పార్టీ వచ్చినా.. ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై చూపడం ఖాయమన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. మరిఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!