YSRCP: గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో వరసబెట్టి పార్టీ నేతలు వలసల బాట పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం వైసీపీ రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం అనే మాట అటుంచితే.. కూటమి ప్రభుత్వం కొందరు వైసీపీ నేతలకు టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ యంత్రాంగం కొందరు వైసీపీ నేతలను తమవైపుకు లాక్కునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తుందని, తద్వారా రాష్ట్రంలో వైసీపీని రూపు మాపాలనే దురుద్దేశంతో ఉందని సమాచారం. ఈ క్రమంలో వైసీపీ నుంచి మరో ముఖ్య నేత పార్టీని వీడనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అతి త్వరలోనే వైసీపీని వీడనున్నారనే ప్రచారం పెద్దఎత్తున సాగుతోంది. సామినేని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత వైసీపీలో చేరి అధినేత వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నారు. ఈ మేరకు జగన్ ఆయనకు 2014, 2019లలో టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. 2014లో ఓడినప్పటికీ అదే పట్టుదలతో ఉదయభాను 2019లో పోటీ చేసి గెలిచారు. ఆయనకు జగన్ విప్ పదవిని కట్టబెట్టారు. కానీ, మంత్రి పదవి విషయంలో విస్తరణ సమయంలో ఆశలు పెట్టుకున్న ఉదయభాను అది దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా యాక్టివ్ గా లేని ఉదయభాను ప్రస్తుతం పార్టీని వీడుతారనే ప్రచారం ఊపందుకుంది. అన్నీ కుదిరితే త్వరలోనే జనసేనలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ కుటుంబానికి విధేయుడిగా ఉండి, జగన్ అండదండలతో పార్టీకి బలంగా పని చేసిన ఉదయభాను వైసీపీని వీడితే సీనియర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. అయితే అసలు నిజాలు ఏంటో తేలాలంటే దీనిపై ఒక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.