AP POLITICS : సంపద సృష్టిస్తాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎప్పుడూ చెప్పుకునే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తరచూ ఓ మాట అంటూ ఉంటారు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటాం, ఎదుర్కొంటాం అని. మరి ఆయన నోట్లో ఏముందో కానీ.. అధికారం చేపట్టిన వంద రోజుల్లో నిజంగానే రాష్ట్రాన్ని సమస్యల వలయంలో పారేశాడు. అధికారంలోకి వచ్చిన మొదటి వారం, పది రోజుల్లో ఎక్కడ చూసినా హత్యలు, కొట్లాటలతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. మరోవైపు ఇసుక విషయాన్ని కూడా టీడీపీ నేతలు రాజకీయంగా మార్చుకున్నారు. మొదట్లో చూసీచూడనట్టు వ్యవహరించిన వైసీపీ అధినేత జగన్ తర్వాత స్పందించి కూటమికి బుద్ధి చెప్పేలా ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నారు. ఇక ఈ వంద రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాల సంగతి సరేసరి.
అభివృద్ధిని పక్కనపెట్టి విమర్శలకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం ఈ సమస్యల వలయం నుంచి బయటపడే లోపే ఐదేళ్లు గడిచిపోతాయని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. అవకాశం దొరికితే వైసీపీపై విరుచుకుపడే టీడీపీ కూటమికి ఎక్కువ కాలం గడువు లేదని, ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్తారని అంటున్నారు. అలా అధికారం చేపట్టిందో లేదో ఇలా రాష్ట్రాన్ని సమస్యలు చుట్టుముట్టాయని, వాటి నుంచి బయటపడలేక, ప్రజలకు మొహం చూపించుకోలేక టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతుందని పలువురు వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. తన ఉనికికి కాపాడుకునేందుకే ప్రతిపక్షంపై అర్థం లేని ఆరోపణలు చేస్తూ టీడీపీ పబ్బం గడుపుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మాటేమిటి అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం లాంటి మరికొన్ని సాకులను టీడీపీ కూటమి ఎత్తిచూపిస్తోందని వైసీపీ అంటోంది.