YS Jagan: తిరుమల పర్యటన రద్దుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీ తప్పులను ఎండగట్టిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై తాజాగా జగన్ ఓ కీలక ట్వీట్ చేశారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ వీడియోని ప్రతి ఒక్కరూ వినాలని కోరుతూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, శివసేన.. లాంటి ప్రముఖ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా పేరున్న పార్టీలను ట్యాగ్ చేస్తూ ఆయన ఈ ట్వీట్ చేశారు. ఇదే వివాదంపై ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ లేఖ కూడా రాశారు. ఆ లేఖ ప్రతుల్ని కూడా అందరూ చదవాలనీ ఇతర పార్టీలను, నేషనల్ మీడియాని జగన్ కోరారు. ఇదంతా చూస్తుంటే ఈ వ్యవహారం మొత్తాన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు కల్పితాలు అని, అధికార టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం ప్రజలకు అర్థమవడానికే జగన్ కంకణం కట్టుకున్నట్లు అర్థమవుతుంది. అది కూడా ఒక్క ట్వీట్ కాదు.. తన ప్రెస్ మీట్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి వరుసగా నాలుగు ట్వీట్లు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంతో పాటు తనను తిరుమల రాకుండా అడ్డుకున్నారనే విషయాన్ని జాతీయ స్థాయిలో వ్యాప్తి చేసి ప్రతిపక్షాన్ని ఎండగట్టాలని జగన్ భావిస్తున్నారు. ఏపీలో అధికార మార్పిడి జరిగిన కొత్తల్లో.. ఢిల్లీలో ఓ నిరసన ప్రదర్శన చేపట్టారు జగన్. అప్పుడు కూడా అన్ని పార్టీల నేతల్ని ఆహ్వానించారు. కొందరు వచ్చారు, మరికొందరు తమకు ఆహ్వానం లేదన్నారు. ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో తమకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్.