Jansena: జనసేనలో చేరకముందే ప్రత్యర్ధి వర్గం చేష్టలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ చేరిక కూటమిలో ఇప్పటికే చిచ్చును రాజేయగా.. మరోవైపు బాలినేనికి భవిష్యత్తులో రాజకీయ సహకారం అందడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్ కుటుంబాన్ని కాదనుకుని ఆయన బయటకు వచ్చి పెద్ద తప్పు చేశారనే చెప్పాలి. వరుసగా ఎమ్మెల్యేగా అవకాశాలు ఇవ్వడంతో పాటు, మంత్రిని చేసిన జగన్‌పైనే బాలినేని విషం కక్కారు.కేవలం మంత్రి పదవి నుంచి తొలగించారనే అక్కస్సుతో ఆయన వైసీపీని రోడ్డుకు ఇడ్చిన విధానాన్ని చూసిన తర్వాత ఇలాంటి వారు పార్టీలో ఉండటం కన్నా వెళ్లడమే నయమని వైసీపీ శ్రేణులు భావించాయి.
అయితే ఎన్నో ఆశలతో జనసేనలో చేరుదామని భావించిన బాలినేనికి అడుగడునా అవమానాలే ఎదురవుతున్నాయి. బాలినేని రాకను కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఒంగొలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల బాలినేని రాకను అడ్డుకుంటున్నారు. కబ్జాలు చేసిన భూములను కాపాడుకోవడానికే ఆయన జనసేనలో చేరుతున్నారని మండిపడ్డారు. అవినీతి కుంభకోణాల నుంచి బాలినేనిని పవన్ కళ్యాణ్ రక్షిస్తాడేమో చూస్తా అంటూ నేరుగానే హెచ్చరికలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు పోరాటం చేశామని, ఒంగోలులో టీడీపీ శ్రేణులపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించారని, తనపైనే 32 కేసులు పెట్టారని దామచర్ల గుర్తుచేశారు.
తాజాగా.. నగరం అంతటా బాలినేని అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేయడం మళ్లీ చర్చనీయాంశమైంది. బాలినేని గురువారం అధికారికంగా జనసేనలో చేరాల్సి ఉంది. ఆయనకు స్వాగతం చెబుతూ.. ఆయన అభిమానులు నగరం అంతటా ఫ్లెక్సీలు వేశారు. కానీ, నిన్న రాత్రి వాటిని ఎవరో చించేశారు. మొన్న చర్చి సెంటర్‌లో.. ఈ మంగళవారం లాయరు పేటలో.. ఇలాగే బాలినేని వెల్‌కమ్ ఫ్లెక్సీలు చించివేయడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే..
బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తెలుగు దేశం నాయకులు మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫొటో వేయడాన్ని తెలుగు యువత వ్యతిరేకించింది. మరోసారి ఇలాంటి ఫ్లెక్సీలు వేస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఈ పరిణామం పెద్ద దుమారమే రేపింది. అయితే మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దామచర్ల జనార్దన్ ఫొటో లేదు. కానీ.. చంద్రబాబు ఫొటో మాత్రం ముద్రించారు. వాటినీ ఎవరో చించేశారు.
దీంతో బాలినేని చేరిక ముందే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరోవైపు ఆయన అనుచరులు వైసీపీలోనే ఉంటేనే గౌరవంగా ఉందనే విషయాన్ని బాలినేని దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే బాలినేని జగన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే పార్టీని ఘోరంగా అవమానించిన బయటకు వెళ్లిన బాలినేనితో జగన్ అపాయింట్‌మెంట్ ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.