YSRCP: వైసీపీకి మరో షాక్ తప్పదా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోవడంతో వైసీపీకి నేతలు ఒకొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తొలుత వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం సినీ నటుడు అలీ సైతం తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటన ఇచ్చారు. కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు, తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరంతా ఏ పార్టీలో చేరకపోయినా వైసీపీని మాత్రం వీడారు. తాజాగా ఈ లిస్ట్‌లో జగన్ అత్యంత సన్నిహితుడు పేరుగా వినిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో కీలక నేత, జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరు గాంచిన సామినేని ఉదయభాను సైతం పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. జగ్గయ్యపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఉదయభాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహిత నేత. గతంలో కాంగ్రెస్‌లో కొనసాగిన సామినేని ఉదయభాను , వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. 2014లో ఓడిపోయిన ఆయన 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. మంత్రివర్గంలో స్థానం ఆశించారు.
కానీ జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రభుత్వ విప్‌గా మాత్రమే అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేసిన ఆయన 15 వేల ఓట్లతేడాతో ఓడిపోయారు. మిగతా నియోజకవర్గాల్లో 50 వేల మెజారిటీలు దాటితే.. ఇక్కడ మాత్రం 15 వేలకు తగ్గించగలిగారు సామినేని ఉదయభాను. తనతో పాటు పార్టీ కూడా ఓడిపోవడంతో ఆయన రాజకీయంగా సెలైంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు సైతం సామినేని దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలోనే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే సమాచారం అందుతోంది. ఆయన ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆయన జనసేనలో చేరితే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని తెలుస్తోంది. మరి వైఎస్ ఫ్యామిలీని కాదని సామినేని ఉదయభాను జనసేనలో చేరతారో లేదో చూడాల్సి ఉంది.