AP Politics:చంద్రబాబునాయుడు నివాసం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పాలన హయాంలో జరిగిన దాడికి సంబంధించి వైసీపీ పార్టీ నాయకులకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అంతేకాదు సుప్రీంలో అప్పీలు చేసుకునే వరకు వారిని అరెస్టు చేయకుండా రక్షణ ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇలాంటి తీర్పు ఎప్పుడు ఇస్తుందా తక్షణం రంగంలోకి దిగుదామా అని చాలా రోజుల నుంచి చూస్తున్నట్టుగా పోలీసులు రంగంలోకి దిగారు.
మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేయడానికి ఆయన నివాసానికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేరు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో దాడుల విషయంలో కేసులు ఉన్న కీలక నాయకులు సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుని అక్కడ నుంచి ఉత్తర్వులు తెచ్చుకునే దాకా అజ్ఞాతంలోకి వెళ్లాల్సిందే అని పలువురు భావిస్తున్నారు. సుప్రీం కోర్టులో గురువారమే అప్పీలు దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం నాయకుడు అయ్యన్నపాత్రుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అత్యంత అసభ్యకరమైన భాషలో తిట్టినందుకు వైసీపీ కార్యకర్తలు ఆగ్రహించారు. వారి దుడుకు ప్రతిస్పందనలో చంద్రబాబునాయుడు నివాసం మీదికి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదికి కూడా వెళ్లారు. పార్టీ కార్యాలయానికి కొంత మేర నష్టం జరిగింది కూడా. ఈ దాడులకు సంబంధించి అప్పట్లోనే పోలీసు కేసులు నమోదు అయ్యాయి.
తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కేసులను తిరగతోడి, కొత్త సెక్షన్లు జత చేయించి అయిదుగురు నాయకుల మీద కేసులు పెట్టించింది. నివాసం మీద దాడి కేసులో జోగి రమేశ్ అలాగే పార్టీ ఆఫీసు మీద దాడి కేసులో నందిగం సురేష్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పేర్లున్నాయి. ఈ నాయకులందరూ ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు వెళ్లారు. ఇన్నాళ్లు వాదప్రతివాదాలు జరిగాయి. తీరా వారికి చేదుగా ధ్వనించే తీర్పు వచ్చింది. వారి విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. అప్పీలుకు వెళ్లే వరకు అరెస్టు చేయరాదని ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు. నందిగం సురేష్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. మిగిలిన నాయకులు కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ట్విస్ట్ ని చంద్రబాబు బ్యాచ్ ఊహించి ఉండదని వీళ్ళని జైల్లో పెట్టాలనే వారి కోరిక నెరవేరలేదు కాబట్టి వారికి ఇది ఒక చేదు అనుభవమే అని చెప్పుకోవచ్చు. సుప్రీమ్ కోర్ట్ లో అప్పీల్ చేసుకుంటే ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఇది జగన్ వర్గానికి గుడ్ న్యూస్ అని భావించొచ్చు.