Etela Rajendhar: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ కు చాన్స్ ఇవ్వనున్నారా? ఆయన అయితే సరిపోతారని హైకమాండ్ భావిస్తోందా? పీసీసీ పీఠం బీసీ వర్గాలకు కేటాయించడంతో.. బిజేపీ కూడా బీసీ ప్రయోగం చేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో దేశంలో జనాభా పరంగా అతిపెద్దదైన లోక్ సభ నియోజకవర్గం అయిన మల్కాజ్ గిరి నుంచి 2024 ఎన్నికల్లో 3 లక్షలకు పైగా భారీ మెజారిటీతో రాజేందర్ గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన ఈయనకు ఈ రోజు కేంద్ర మంత్రివర్గంలో క్యాబినేట్ బెర్త్ కన్ఫామ్ అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు మాత్రమే కేంద్ర క్యాబినేట్ లో బెర్త్ లు కన్ఫామ్ అయ్యాయి. వివిధ సమీకరణలతో రాజేందర్ కు పదవి దక్కకుండా పోయింది.
అయితే ఇటీవల బండి సంజయ్ కు తిరిగి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ బీజేపీలో జోడు పదవులకు చాన్స్ లేదు. కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ కు ఆ చాన్స్ లేదని తెలుస్తోంది. అందుకే తాజాగా ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయని రాష్ట్ర బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి గెలిస్తే పక్కా కేంద్ర మంత్రి పదవి ఖాయమనుకున్న రాజేందర్ కు ఇపుడు తెలంగాణ రాష్ట్ర సారథి బాధ్యతలు అప్పగించడం దాదాపు ఖాయమైనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రం ఆధారంగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కిషన్ రెడ్డి.. త్వరలో తెలంగాణ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించాలన్నది బీజేపీ వ్యూహం. ప్రధానంగా తెలంగానలో అధికారంలోకి రావాలని ధ్యేయంగా పెట్టుకుంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతలను ఈటలకు అప్పగించనున్నారు. దానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మల్కాజ్ గిరి నుంచి విజయం సాధించిన సర్వే సత్యనారాయణ అప్పటి మన్మోహన్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత మల్లారెడ్డి.. తెలంగాణ క్యాబినేట్ మంత్రి అయ్యారు. 2019లో గెలిచిన రేవంత్ రెడ్డి ఏకంగా 2023 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి విజయం సాధించిన అభ్యర్ధులకు లక్ కలిసొస్తుందనే సెంటిమెంట్ ఏర్పడింది. కానీ ఈటలకు కేంద్ర మంత్రి కాకుండా బీజేపీ ఛీఫ్ గా నియమించబడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈటల రాజేందర్ రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తూ వచ్చారు. 2003లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు రాజేందర్. 2004లో కమలపూర్ నుంచి ఉప ఎన్నికతో కలిపి రెండు సార్లు ఆ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2010 జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఈ స్థానం నుంచి గెలిచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఒదిలారు. ఆ తర్వాత2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2021లో టీఆర్ఎస్ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ తరుపున హుజురాబాద్ నుంచి గెలిచి సంచలనం రేపారు. 2014 లో కేసీఆర్ మంత్రి వర్గంలో ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా తన వంతు బాధ్యతలు నిర్వహించారు. అటు 2023 ఎన్నికల్లో హూజురాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. కానీ అనూహ్యంగా 2024 ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి తొలిసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ గా తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సునీతా మహేందర్ రెడ్డి పై మూడు లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.ఇప్పుడు రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించడానికి హైకమాండ్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.