BJP-CONGRESS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడె కౌశిక్ రెడ్డి వెనుకలా సీనియర్ మంత్రి ఉన్నారా? ఆయన అండదండలతో రెచ్చిపోతున్నారా? సొంత పార్టీపై అసంత్రుప్తితో సదరు మంత్రి ఇదంతా చేయిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పెద్దలపై రివేంజ్ తీర్చుకునేందుకు ఈ ఇష్యూను సదరు మంత్రి క్రియేట్ చేశారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్విట్ చేసింది. దీంతో సదరు మంత్రి ఎవరు?ఆయనకు ఆ అవసరం ఏంటి? బీజేపీ ఎందుకు ఈ విషయాన్ని బయటపెట్టింది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్ర బీజేపీలో కొందరు పెద్దలకు.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక నేతలకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ ప్రచారానికి తగ్గట్టే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ మెతక వైఖరి వహిస్తుందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య అవగాహన ఉందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇలా ప్రతి పొలిటికల్ ఇష్యూలోనూ మూడు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు వినిపించేవి. ఐతే తాజాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ రచ్చలో ఎక్కడా బీజేపీ పాత్ర కనిపించలేదు.అసలు ఆ పార్టీ నేతల మాట్లాడేందుకు కూడా చాన్స్ దక్కలేదు. ఈ పరిస్థితుల్లో పొలిటికల్‌గా తమ పార్టీ ఉనికిని చాటుకోవాలని డిసైడ్ అయిన కమలనాథులు…. ఇష్యూని డైవర్ట్ చేసేలా ప్లాన్ చేశారంటున్నారు. అందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వెనుక కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారనే ఆలోచన కల్పించేలా ఎక్స్‌లో ట్వీట్ చేశారు కమలనాథులు. బీజేపీ అధికారిక ఖాతాలోనే ఈ ట్వీట్ చేయడం ద్వారా మూడు రోజులుగా కొనసాగుతున్న రచ్చ తనవైపు టర్న్ అయ్యేలా చేశారు బీజేపీ నేతలు.
అయితే రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ను ఎందుకు టార్గెట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలకు బీజం వేయాలనే ఆలోచనతోనే బీజేపీ ఈ విధంగా ట్వీట్ చేసిందని హస్తం పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఇందుకోసం మంత్రి ఉత్తమ్‌ను ఎంచుకోవడమే ఎవరికీ అంతుచిక్కడం లేదు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బంధుత్వాన్ని రాజకీయాలకు ముడిపెట్టడమేంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలపడి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ… ఆ స్థాయిలో పనితీరు కనబరచడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటంతో ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో బీజేపీ నేతలు ఎవరికివారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు వంటివారు అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ తామున్నామనే భావన కల్పిస్తున్నా.. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాడిన స్థాయిలో ఇప్పుడు పోరాడటం లేదని అంటున్నారు.
తెలంగాణలో తాజా రగడలోకి ఉద్దేశపూర్వకంగా బీజేపీ చొరబడిందని అంటున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని సీనియర్ మంత్రిని లక్ష్యంగా చేసుకుంటే… ఇష్యూలోని సీరియస్‌నెస్ పెంచొచ్చని ప్లాన్ చేసివుంటుందని అంటున్నారు. ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో ఉత్తమ్‌కు బంధుత్వం ఉండటం వల్ల ఆయనను టార్గెట్ చేయడం ద్వారా రెండు పార్టీలను ఇరుకన పెట్టొచ్చని బీజేపీ వ్యూహం పన్నిందని అంటున్నారు. అనుకున్నట్లే పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నప్పటికీ అది బీజేపీనే ఇబ్బందుల్లోకి నెట్టిందనే చర్చ సాగుతోంది. కాంగ్రేసులోని మరెవరికోసమో ఉత్తమ్‌ని బీజేపీ టార్గెట్ చేసిందనే గుసగుసలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ ట్వీట్ తో ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్ ఎలాంటి ఎదురుదాడి చేస్తుందనేది చూడాల్సివుంది.