Sunday, October 13, 2024

Telangana Politics: ఉప ఎన్నికలకు వెళితే గెలవగలమా? కాంగ్రెస్ లో తర్జనభర్జన

- Advertisement -

Telangana Politics: తెలంగాణా పొలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఉప ఎన్నికలు రానున్నాయి అని స్పష్టమవుతుండడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారనున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ లోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఉంటారా? లేకుంటే వెనక్కి వెళతారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్నర్ అవుతోంది. ఇప్పటికిప్పుడు 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటే భారతీయ రాష్ట్రసమితి మనుగడే ప్రశ్నార్థకం చేయవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు అంతమంది కాంగ్రెస్ లోకి వస్తారా? వచ్చే చాన్స్ ఉందా? అంటే మాత్రం మౌనమే సమాధానం అవుతోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుట రెండే మార్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో సుప్రిం కోర్టును ఆశ్రయించడమో.. లేకుంటే ఉప ఎన్నికలకు సిద్ధపడడమూ చేయాలి. అయితే ఉప ఎన్నికలకు వెళితే ఆ పార్టీ గెలిస్తే పర్వాలేదు. ఓడిపోతే మాత్రం తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో పడడం ఖాయమని తెలుస్తోంది.

తెలంగాణలో ఉప ఎన్నికల పైన చర్చ మొదలైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పైన తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీఎం రేవంత్ క్యాంపు అప్రమత్తం అయింది. తమ ముందున్న ప్రత్యామ్నాయాల పైన కసరత్తు చేస్తోంది. ఉప ఎన్నికలు వచ్చినా సిద్దం కావాలని డిసైడ్ అయింది, సర్వే రిపోర్ట్స్ అధ్యయనం చేస్తోంది.కానీ అక్కడే మరో అంశం కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. ఉప ఎన్నికల పైన ప్రధాన పార్టీల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. వీరి పైన నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దీని పైన స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. మిగిలిన ఎమ్మెల్యేల పైన అనర్హత పిటీషన్లు స్పీకర్ వద్ద ఉన్నాయి. అయితే ఈ సమయంలో అనర్హత వేటు పై ఏం చేయాలనేది కాంగ్రెస్ లో తర్జన భర్జన సాగుతోంది.హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన డివిజన్ బెంచ్..అవసరమైతే సప్రీంకు వెళ్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే, అక్కడ ఎలాంటి ఫలితం ఉంటుందనే అంశం పైన న్యాయ నిపుణులతో చర్చలు చేస్తున్నారు.

ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే మరో రెండు ఆప్షన్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ ను అడ్డగోలుగా చీల్చితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పైచేయి అవుతుంది. సాంకేతికంగా మరో 16 మంది ఎమ్మెల్యేలను తమ వైపు చేర్చుకుంటే బీఆర్ఎస్ చీలిక వచ్చి పొలిటికల్ మైలేజ్ వస్తుంది.అయితే తాజాగా హైకోర్టు తీర్పుతో ఇంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు మొగ్గు చూపుతారా అనేది సందేహమే.ఇప్పటివరకూ కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టపూర్వకంగా చేరలేదు. రకరకాల ఒత్తిళ్లు, పదవి ఆకాంక్ష తదితర కారణాలతోనే వారు కాంగ్రెస్ బాట పట్టారు. కానీ ఇప్పుడు న్యాయ చిక్కులు ఎదురుకావడం, బీఆర్ఎస్ పార్టీ పట్టుబిగించడంతో బీఆర్ఎస్ ను ఎమ్మెల్యేలు వీడే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు సైతం వెనక్కి వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. లేకుంటే అనర్హత వేటు పడి ఉప ఎన్నికకు వెళ్లాల్సి వస్తోందన్న భయం కూడా చాలా మందిలో ఉంది.

అయితే తాజాగా బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపినట్టు ఆ ముగ్గురు ఎమ్మెల్యేపై వేటుపడితే… అవసరమైతే ఉప ఎన్నికలకు సిద్దమయ్యే అంశం పైన కాంగ్రెస్ పార్టీలో విస్త్రత చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏడాది కాకుండానే ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజల్లో వచ్చే స్పందన…రాజకీయగా తమకు ప్రస్తుతం ఉన్న పట్టు పైన సర్వే నివేదికలను సీఎం రేవంత్ నిఘా వర్గాలను కోరినట్లు సమాచారం. ఉప ఎన్నికలు ఖాయమైతే ఈ పది మందిలో కొందరు తిరిగి తమ సొంత గూటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల హామీలు పూర్తిగా అమలు కాలేదు. అయితే, తాము అమలు చేస్తున్న హామీలతో ప్రజల్లో సానుకూలత ఉందనే వాదన కాంగ్రెస్ నేతల్లో ఉంది. కానీ ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్తే ఫలితం ప్రతికూలంగా ఉంటే మొత్తానికే మోసం వస్తుందనే ఆందోళన కూడా కనిపిస్తోంది. దీంతో ఢిల్లీ పర్యటన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్తారనేది స్పష్టం అవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!