Congress Government: మేం అధికారంలోకి వస్తే నిత్యావసరాల ధరలను అదుపులో ఉంచుతాం. సామాన్యుడిపై భారం లేకుండా చేస్తాం.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఇది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ధరల స్థిరీకరణ మాట లేదు. అమాంతం పెరిగిపోయాయి. అందనంత దూరానికి చేరుకున్నాయి. దేశంలో నిత్యవసరాల ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉందని ఓ జాతీయ స్థాయి అధ్యయనం తేల్చింది. ధరల పెరుగుదలతో సామాన్య జనం సైతం సతమతమవతున్నారు. ధరల పెరుగుదలను నియంత్రిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది.
ఉదయం లేస్తే.. టీలు, టిఫిన్లు, కాఫీలు, సాయంత్రం స్నాక్స్.. ఇవన్నీ దాదాపు బయటి ఖర్చులే. మధ్యాహ్నం లంచ్, నైట్ కి డిన్నర్ కావాలంటే ఇంట్లో వండుకుంటారనుకుందాం. పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, స్కూల్ ఫీజులు.. వాళ్లకి నచ్చిన డ్రెస్సులు, నచ్చిన ఫుడ్, అప్పుడప్పుడు అవుటింగ్.. ఇలా చాలా ఖర్చులుంటాయి. ఇన్ని ఖర్చుల్లో.. కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలన్నా జరగని పని. వాటిలో మొదటిది నిత్యావసర వస్తువులు.ఇంటిల్లిపాది కడుపునిండా తినాలంటే నెలకు సరిపడా సరకులు తప్పనిసరిగా ఉండాలి. ఇక కూరగాయలైతే వారానికొకసారి తెచ్చిపెట్టుకుంటారు. రూ.10 కి, రూ.20కి కిలోల కూరగాయలొచ్చే రోజులు పోయాయి. పోని రూ.100 పెడితే నాలుగు రకాల కూరగాయలైనా వస్తాయా అంటే.. అదీ లేదు. ఒక రకం కేజీ కొనాలంటే రూ.100 వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది. నాలుగైదు రకాలు కొనాలంటే రూ.400-రూ.500 వరకూ ఖర్చు చేయాలి. ఒక వారంరోజులకు సరిపడా కావాలంటే.. రూ.800 వందలైనా కూరగాయలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.
అసలు కూరగాయల ధరలకు ఎందుకు రెక్కలొచ్చాయి. తగ్గినట్టే తగ్గి.. అమాంతం పెరిగిపోవడం వెనుక ఉన్న కారణాలేంటో చూస్తే.. ప్రధానంగా కనిపిస్తున్నది వరదలు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదల కారణంగా చాలా వరకూ పంటలు దెబ్బతిన్నాయి. పూత, పిందల మీద ఉన్న మొక్కలు నీట మునిగి కుళ్లిపోయాయి. టమాటా, సొరకాయ, దోసకాయ, దొండకాయలు, బెండకాయలు, వంకాయలతో పాటు.. ఆకుకూరలు వేసిన పంటలు కూడా వర్షార్పణమయ్యాయి. దీంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతు బజార్లలో కంటే.. ప్రైవేటు మార్కెట్లలో ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. కొత్తిమీర కట్ట అయితే.. ఒకటి రూ.80 నుంచి రూ.100 వరకూ పలుకుతోంది. కార్తీకమాసం ముందునుంచే మార్కెట్లలోకి వచ్చే చిక్కుడు కాయల ధర కిలో రూ.40 నుంచి రూ.80కి చేరింది. ఆకుకూరలు రూ.20కి నాలుగైదు కట్టలు వచ్చేవి కాస్తా.. ఇప్పుడు రెండే ఇస్తున్నారు. తెలంగాణలో ఉన్న నగరాల్లోనూ ఇదే పరిస్థతి.
అదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో.. జేబుకు చిల్లు పడుతుందని, సేవింగ్స్ ఉండటంలేదని వాపోతున్నారు ప్రజలు. ధరలు పెరగడమే కానీ.. తమ జీతాలు మాత్రం పెరగట్లేదని.. ఇలాగైతే ఏం కొనాలి, ఏం తినాలని పెదవి విరుస్తున్నారు. కూరగాయలు అయితే పంటలు పోయాయి పెరిగాయని భావించవచ్చ. కానీ నిత్యావసరాల ధరలు పెరగడం ఏంటి? అన్నది ఇప్పుడు ప్రశ్న. ప్రభుత్వం నియంత్రించే చర్యలు చేపట్టకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఎన్నికలకు ముందు నిత్యవసరాల ధరల పెరుగుదను నియంత్రిస్తామని ప్రకటనలు చేశారు. ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారన్నదే ఇప్పుడు ప్రశ్న. ధరల పెరుగుదలతో సామాన్యులు సైతం బాధపడుతున్నారు. ఇటువంటి సమయంలో స్పందించాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.