AP Politics:రెండు తెలుగు రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భారీ వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానం విజయవాడ నగరం అస్తవ్యస్తమై నగర ప్రజలకు ముచ్చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలో కేంద్రం చొరవ తీసుకుని తక్షణ ఆర్ధిక సాయం కింద 3,300 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినట్లుగా విస్తృత ప్రచారం జరిగింది. ఈ మేరకు ఏపీ కష్టాలు పూర్తిగా తీరిపోతాయని భావించారు. కానీ, దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఏపీకి 3,300 కోట్ల రూపాయలు భారీ సాయం అన్నది ప్రచారం మాత్రమే అని చంద్రబాబు అనడం విశేషం. నిధుల కేటాయింపు విషయం ప్రచారంలో ఉన్నదే తప్ప అధికారికంగా కాదని చెప్పినట్లుగా అర్థమవుతోంది. అదే సమయంలో తమకు కేంద్ర సాయం మీద ఎటువంటి సమాచారం కూడా లేదని స్వయానా సీఎం స్పష్టం చేయడం గమనార్హం.
టీడీపీ పొత్తులు పెట్టుకుని గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్ర పీఠాన్ని అధిరోహించింది. కేంద్రంలోని బీజేపీతో కూటమిగా ఏర్పడినప్పటికీ వరద విపత్తులో కేంద్ర సాయం అందుకోలేకపోవడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఏపీ నుంచి నివేదికలు వెళ్లిన తర్వాతే కేంద్రం సాయం అందిస్తుందన్నది చంద్రబాబు మాటల ద్వారా స్పష్టమవుతోంది. ఇదంతా ఇలా ఉండగా.. ఏపీలో వరదల విపత్తును జాతీయ విపత్తుగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. టీడీపీ నాయకత్వం కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా సాయం కోసం ఎదురుచూడడం ఏంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి ఏ సాయం అందినా కూడా అది అధికారికంగానే ప్రకటించాలి.. అంతేకానీ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడం ఏంటని పలువురు అంటున్నారు