Chandrababu: ఏపీలో వరద విపత్తు పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొంతమేర చక్కబడుతున్నాయి. బుడమేరు వరద ముంచెత్తడంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్న సంఘటనలు ఇంకా కొన్ని చోట్ల కనబడుతున్నాయి. జక్కంపూడి కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ ప్రజలు సరైన ఆహారం అందక ఆకలితో అలమటిస్తున్నారు. సర్వం కోల్పోయి తినడానికి తిండి, ఉండడానికి నీడ లేని కొందరు బాధితులు తాగునీరు, పాల కోసం కూడా ఆశగా చూస్తున్నారు. వరద విపత్తు నుంచి పూర్తిస్థాయిలో ఉపశమనం లభించక, ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేక సాయం కోసం చూస్తున్న ఎదురుచూపులే ఎక్కడ చూసినా. ఇదంతా ఇలా ఉండగా.. మరోవైపు, ముందస్తు ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన సీఎం చంద్రబాబుకి చాదస్తం ఎక్కువైనట్లు తెలుస్తోంది. వరదొచ్చినా, బురదొచ్చినా ఆ నెపం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై నెట్టేస్తూ కాలం గడుపుతున్నాడు.
వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో టీడీపీ వైఫల్యం చెందినట్లు స్పష్టంగా కనబడుతున్నా.. అసలు విజయవాడ మునిగే వరకూ చంద్రబాబుతో పాటు కూటమి నేతలు నిద్ర మేలుకోలేకపోయారు. ఇప్పుడు వరద బాధితుల ఆగ్రహావేశాలను గ్రహించిన చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టడానికే బోట్ల రాజకీయాలకి తెర లేపారు. వరద ముంపు సమయంలో ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు టీడీపీ వాళ్లవే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆ బోట్ల యజమాని ఉషాద్రి టీడీపీ కార్యకర్త కాగా.. నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు అని నిరూపించేలా ఒక ఫోటో తాజాగా చక్కర్లు కొడుతోంది. మరి కృష్ణానదిలో కుట్రపూరితంగానే బోట్లు వదిలారనే విషయం నిజమని చెప్పడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం కావాలా? ఆ విషయం టీడీపీ కూటమి ప్రభుత్వానికి, పార్టీ పెద్దలకు కూడా తెలిసినప్పటికీ వైసీపీపై బురద చల్లడం ఎంతవరకు సమంజసం? అయినా జరిగిన తప్పుని ఒప్పుకునే ధైర్యం లేనప్పుడు బురద చల్లే హక్కు ఎక్కడిది అని టీడీపీపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.