YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం చేపడుతున్న పనులు, తీసుకుంటున్న కొన్ని చర్యలు ప్రజలను అవస్థల పాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది టీడీపీ ప్రభుత్వం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అత్యంత పారదర్శకమైన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కమిషన్ల కక్కుర్తితో సీఎం చంద్రబాబు రద్దు చేశారు. ఈ రివర్స్ టెండరింగ్ విధానంలో 2019-2024 మధ్య రూ.7,500 కోట్లని అప్పటి ప్రభుత్వం ఆదా చేసింది. కానీ, ఇప్పుడు ఆ ధనం అంతా టీడీపీ నేతల జేబుల్లోకి చేరేలా అవినీతి రాజకీయాలు చేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం. గతంలో జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను సైతం టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చిన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. జల వనరుల మంత్రిత్వ శాఖలో లోటుపాట్లను పూడ్చి, దుబారా ఖర్చులు అరికట్టే దృష్ట్యా జగన్ అమలు చేసిన గొప్ప విధానం ఇది. రివర్స్ టెండరింగ్‌ను అమలు చేస్తూ 2019, ఆగస్టు 16న జారీ అయిన జీవో నంబర్ 67ను రద్దు చేసింది టీడీపీ ప్రభుత్వం. దాని స్థానంలో పాత విధానం ఆన్‌లైన్ ఇ-ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థను అనుసరిస్తామని తెలిపింది.