BREAKING : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవుడితో ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని అన్నారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడటం కాదు జంతువుల కొవ్వు వాడుతున్నారని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న చంద్రబాబు ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాస్తానని తెలిపారు. తిరుమలలో సరుకులకు మూడంచెల్లో చెకింగ్ ఉంటుందని సజ్జల తెలిపారు. జూన్ 12న నెయ్యి శాంపిల్స్ తీసుకుంటే 23న రిపోర్టు వచ్చిందని చెప్పారని అన్నారు. మరి ఆ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించారా లేదా అని ప్రశ్నించారు. తిరుమలలో ల్యాబ్ లేదని చెప్పారని మరి రిపోర్టు తిరుమల ల్యాబ్ అడ్రస్‌తోనే ఎలా వచ్చిందని నిలదీశారు.
టీటీడీ చేయించిన టెస్టులో జంతువుల కొవ్వు ఆనవాళ్లు లేవని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఆవులు తినే ఆహారం బట్టి పాలల్లో లక్షణాలు ఉంటాయని అన్నారు. ఆవులు ఎక్కడైనా మాంసం తింటాయా అని ప్రశ్నించారు. నెయ్యి తయారీ కంటే ముందే పాలను టెస్టు చేసి పంపుతారని టెస్ట్ చేయకుండానే అనుమతి ఇవ్వరని పేర్కొన్నారు. టెస్టుల్లో తేడా వస్తే వెనక్కి పంపుతారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఒక డైరీ యజమాని అని ఆయన అమ్మే హెరిటేజ్ నెయ్యిని పంపించినా ఇలాంటి రిపోర్టే వస్తుందని తెలిపారు. అంటే హెరిటేజ్ నెయ్యిలో కూడా ఇతర జంతువుల కొవ్వు ఉంటుందా అని నిలదీశారు. ల్యాబ్ రిపోర్టు నెగెటివ్ వచ్చింది కానీ చంద్రబాబు మాత్రం జంతువుల కొవ్వు ఉంటుందని తీవ్ర ఆరోపణలు చేశారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుమలపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పెంచాలి తప్ప ఇలా పోగొట్టకూడదని హితవు పలికారు.
చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ లాభాలని పెంచుకోవడానికి మరియు రాజకీయ లబ్ది కోసం బీజేపీ సహాయంతో ఇలా కట్టు కథని అల్లి ప్రజలని మోసం చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ నుంచి వచ్చిన ప్రైవేటు ల్యాబ్ రిపోర్టు ఆధారంగా నెయ్యి మరియు పాల సామ్రాజ్యాన్ని నియంత్రించే ఓ కుటుంబం ఆరోపణలు చేయడం యాదృచ్చికం అని ఆయన పేర్కొన్నారు. టీటీడీ కాంట్రాక్టుని హెరిటేజ్ కంపెనీకి దక్కేలా చేయాలనే దురుద్దేశంతో ఇలా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగడం చాలా దారుణమైన చర్య అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక ఉన్న దారుణమైన నిజాలు బయటికి తీయాల్సిన అవసరం ఉందని సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని ప్రజలకి తెలియజేయాలని ఆయన అన్నారు.