Chandrababu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన దుష్ప్రచారం చంద్రబాబు మెడకే చుట్టుకునేలా ఉంది. ఎక్కడ తన గుట్టు బయటపడుతుందో అని ముందస్తు జాగ్రత్తగా ఈ గండం నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. లడ్డూ వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని యావత్ హిందూ భక్తులు డిమాండ్ చేస్తుంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు. అందుకే సీబీఐ వరకు ఎందుకు అని తన నమ్మకస్తులతో కూడిన ఒక సొంత టీమ్‌కు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను చంద్రబాబు అప్పగించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ముందు నుంచి లడ్డూ వివాదంలో లేనిపోని ఆరోపణలు చేసిన చంద్రబాబు అండ్ టీమ్ ఇప్పుడు కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తోంది.
అయితే.. ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఉన్నారు. ఈ త్రిపాఠిపై ఇటీవల ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులను ప్రోత్సహించినట్లు ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. దీంతో త్రిపాఠిపై గతంలో వైసీపీ ఫిర్యాదు కూడా చేసింది. అంతేకాకుండా పల్నాడు అల్లర్ల సమయంలో కూడా గుంటూరు ఐజీగా త్రిపాఠి ఉన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా త్రిపాఠి హయాంలో అల్లర్లు జరిగాయని ఎన్నికల సంఘం అప్పట్లో మండిపడింది. మరి ఇలాంటి వివాదాస్పద అధికారితో చంద్రబాబు సిట్ ఏర్పాటు చేయించి, కేసును తవ్వించడం సొంత లాభం కోసమే అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాజకీయ లబ్ది కోసం ఏకంగా తిరుమల శ్రీవారినే వాడుకోవడం.. ఆపై గుట్టు రట్టు అవుతుందని సొంత బృందంతో సిట్ ఏర్పాటు చేయించి కేసు తన మీదికి రాకుండా చూసుకోవడం లాంటి మేధాశక్తి చంద్రబాబుకే సాధ్యమని వైసీపీ తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తోంది.