Telangana: గత పదేళ్లలో తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండేది. సమర్థ నాయకత్వం ఉండేది. అనేక ప్రజోపయోగ పనులకు అప్పటి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అలాంటి నిర్ణయాలు తీసుకోగలరా? అంటే అంత సీన్ లేదని తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం విషయంలో ఏ నిర్ణయమూ సవ్యంగా సాగడం లేదు. మెట్రో రైళ్లు, రింగు రోడ్లు.. ఇలా అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ మార్కు నిర్ణయాలు జరుగుతున్నాయి.
తాజాగా హైదరాబాద్ నగరానికి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డు రూటు మారింది. దక్షిణ భాగంలో ఏకంగా నాలుగైదు కిలోమీటర్ల మేర రోడ్డు పెరిగింది. ఇటీవల ఓ కీలక నేత నివాసంలోనే ఈ మార్పునకు అధికారిక ముద్ర పడగా… తాము బహిరంగంగా ప్రకటించేవరకు సమాచారం బయటికి పొక్కొద్దంటూ ఆర్‌అండ్‌బీ అధికారులకు గట్టిగానే హెచ్చరికలు జారీ అయినట్టు సమాచారం. పైకి ఫ్యూచర్ సిటీ కోసమేనంటూ నేతలు చెప్తున్నా.. వాస్తవం వేరే ఉన్నదని ప్రచారం జరుగుతున్నది. నానాటికీ విస్తరిస్తున్న హైదరాబాద్ మహా నగరం పరిధిలో అధునాతన రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రీజినల్ రింగురోడ్డుకు అంకురార్పణ జరిగింది.
కేంద్రప్రభుత్వ సహకారంతో రిజనల్ రింగ్ రోడ్డుకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. అవుటర్ రింగు రోడ్డుకు అవతల 300 కిలోమీటర్లకు పైగా పొడవుతో ట్రిపుల్ ఆర్‌ను ప్రతిపాదించారు. ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఉత్తర, దక్షిణ భాగాలకు సంబంధించిన అలైన్‌మెంట్ ప్రతిపాదనలు కూడా కేంద్రానికి వెళ్లాయి. అందులో భాగంగా తొలుత ఉత్తర భాగం సంగారెడ్డి ఎన్‌హెచ్-65 మీదుగా…తూప్రాన్ ,గజ్వేల్, చౌటుప్పల్ ఎన్‌హెచ్-65 మీదుగా 158 కిలోమీటర్ల మేర అలైన్‌మెంట్ నిర్ధారణ జరిగింది. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగింది. ఎక్కడా ఆరోపణలుగానీ, అనుమానాలుగానీ రాలేదు. దక్షిణ భాగంలో అలైన్‌మెంట్‌కు సంబంధించిన ప్రాథమిక దశ కసరత్తు పూర్తయ్యింది.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా స్వరూపాన్ని మార్చేసింది. నేతల స్వప్రయోజనాల కోసమేనన్న టాక్ నడుస్తోంది. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం వాస్తవానికి 189 కిలోమీటర్లుగా గతంలోనే నిర్ధారించారు. ఎన్‌హెచ్-65 మీదుగా చౌటుప్పల్ నుంచి షాద్‌నగర్- ఆమన్‌గల్ సమీపంలో నుంచి చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు రింగును కలపాల్సి ఉంది. గతంలో అధికారికంగా విడుదల చేసిన ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మ్యాపులోనూ ఇదేరీతిన అలైన్‌మెంట్ ఉన్నది. కానీ కొంతకాలం కిందటి నుంచి అలైన్‌మెంట్‌లో మార్పులపై ప్రభుత్వ పెద్దల స్థాయిలో అంతర్గతంగా తర్జనభర్జనలు జరిగినట్టు తెలిసింది. ఈ మేరకు ఏకంగా నాలుగు కిలోమీటర్ల మేర పొడిగింపుతో పలుచోట్ల అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు.ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రాజెక్టుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడంపై తెలంగాణ సమాజం మండిపడుతోంది.