Revanth Reddy: హైడ్రాపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? మంత్రుల్లో చాలా మందికి ఇష్టం లేదా? సీఎం రేవంత్ కు నిర్మోహమాటంగా చెప్పేశారా? అయినా ఆయన వినలేదా? సీఎం సొంత అజెండాగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. హైడ్రా విషయంలో సీఎం రేవంత్ దూకుడుగా ముందుకు సాగుతున్నారని స్పష్టమవుతోంది. అయితే పార్టీకి నష్టమే కాకుండా.. తెలంగాణకు ఆదాయం తగ్గుముఖం పడుతుందన్న ఆందోళన మంత్రుల నుంచి వినిపిస్తోంది.
హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఆట కట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండు నెలల క్రితం హైడ్రాను ఏర్పాటు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా గ్రేటర్లో చెరువుల ఆక్రమణదారుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. బడాబాబులు మొదలు సామాన్యుల వరకు చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలన్నింటిని నేలమట్టం చేస్తోంది హైడ్రా.ఈ క్రమంలో ఇప్పటివరకు సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది హైడ్రా. ఈ పరిస్థితుల్లో హైడ్రాకు మరిన్ని అధికారులు కట్టబెట్టడంతోపాటు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చట్టబద్దత కల్పించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల మంత్రివర్గ సమావేశంలో జరిగింది. ప్రధానంగా క్యాబినెట్ భేటీలో హైడ్రాపై చర్చ సందర్భంగా మంత్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. హైడ్రాపై ప్రజల్లో ఓవైపు ప్రశంసలు వస్తుండగా.. మరోవైపు వ్యతిరేకత వ్యక్తమవుతోందని కొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా హైడ్రా పనితీరుపై సామాన్యుల్లో ఆందోళనలను ఒకరిద్దరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారట.హైడ్రా ఏర్పాటు తర్వాత.. రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరే ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందనే విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోందని, హైడ్రా ఎఫెక్ట్ తో గ్రేటర్ లో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింటుందేమోననే అభిప్రాయాన్ని కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ చాలా టేకిటీజీగా తీసుకున్నట్టు తెలుస్తోంది.
హైడ్రా ఎఫెక్టుతో ఆగస్టులో సుమారు 400 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందని ఓ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారట. హైడ్రా పనితీరుతో గ్రేటర్ హైదరాబాద్ లో నిర్మాణ సంస్థలు, బిల్డర్లు కొత్త నిర్మాణాలపై అనుమతులు తీసుకోవడానికి జంకుతున్నారన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట మరో సీనియర్ మంత్రి.ఇలాంటి సమయంలో హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టి, చట్టబద్దత కల్పిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ఒకరిద్దరు మంత్రులు క్యాబినెట్ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. హైడ్రా మంచి ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినా, అది ప్రభుత్వ భూములను రక్షిస్తున్నా.. అదే సమయంలో ఎదురవుతున్న ప్రతికూలతలను సైతం పరిగణలోకి తీసుకోవాలని మంత్రులు సూచించారని తెలుస్తోంది.కానీ రేవంత్ పెద్దగా పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీలో ప్రాచారం సాగుతోంది.
హైడ్రాపై మంత్రివర్గ సహచరుల అభిప్రాయాలు, సూచనలను సావదానంగా విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అంతే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో హైడ్రాపై ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని, ఆ సంస్థకు పూర్తిస్థాయి అధికారాలు కట్టబెట్టి, చట్టబద్దత కల్పించడంలో వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి ఆక్రమణలకు గురైన చెరువులను, కుంటలను కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఓ మంచి పని చేసే సమయంలో కొంత నష్టం తప్పదని మంత్రులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారట సీఎం రేవంత్ రెడ్డి.హైడ్రా ముఖ్య ఉద్దేశం, భవిష్యత్తు తరాలకు జరిగే మంచి గురించి ప్రతి సందర్భంలోను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ సూచించినట్లు సమాచారం. మొత్తానికి హైడ్రాపై రియల్ ఎస్టేట్ ఆదాయం తగ్గినా.. ప్రభుత్వ ఆదాయం తగ్గుముఖం పట్టినా ఐ డోంట్ కేర్ అన్నట్టు తెలుస్తోంది.