Thursday, October 3, 2024

Congress- Bjp: కేంద్రం నుంచి వరద సాయం తెప్పించడంలో కాంగ్రెస్, బీజేపీ ఫెయిల్

- Advertisement -

Congress- Bjp: తెలంగాణకు వరద సాయం పొందడంలో సీఎం రేవంత్ విఫలమయ్యారా? కేంద్రం నుంచి తగిన సాయం పొందలేకపోతున్నారా? ఏపీతో పోల్చుకుంటే తెలంగాణకు మొండి చేయి చూపుతున్నా నిస్సహాయ స్థితిలో ఉండిపోయారా? ఎందుకీ దుస్థితి? వాస్తవ పరిస్థితి వివరించడంలో ఫెయిలయ్యారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయంలో బీజేపీ ఎంపీల వైఫల్యం సైతం స్పష్టంగా కనిపిస్తోంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ వైఫల్యం అడుగడుగునా కనిపిస్తుండడంతో తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలపై మండిపడుతున్నారు.

వరదలతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రం ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. కేంద్ర పెద్దలెవరూ సాయం పై నోరు మెదపడం లేదు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. కానీ తెలంగాణకు ఒరిగిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ ఎంపీలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. వీరితో పాటు బీజేపీ ఎంపీల బృందాలు పర్యటించాయి. ఖమ్మం జిల్లాలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించి.. రాకాసితండాలో వరద బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని అభయమిచ్చారు.

ముందుగా.. పంట పొలాల్లో ఇసుక మేటను తొలగిస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగిన ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతే ఇక్కడితో డ్రామా అయిపోయిందని అంటున్నారు. వచ్చారు.. చూశారు.. వెళ్లారు. అనే కాన్సెప్ట్ లోనే నడిచిందని అంటున్నారు. కనీసం వీరెవరూ కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడి నిధులు రప్పించే ప్రయత్నాలు చేయడం లేదనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

వరదల కారణంగా తెలంగాణకు రూ.5,348 కోట్ల మేర నష్టం జరిగిందని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ గా ప్రకటించారు. అంతేకాదు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో జరిగిన సమావేశంలో కూడా ఇదే మాట తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కట్ చేస్తే.. ఫలితం శూన్యం. ఆయన హైదరాబాద్ నుంచి ఫ్లయిట్ ఎక్కి, అన్నీ ఇక్కడే మరిచిపోయారని, ఢిల్లీ వరకు తీసుకెళ్లలేదని అంటున్నారు.

పక్కనే ఉన్న మరో తెలుగురాష్ట్రం ఏపీకి ఎక్కువ నిధులిచ్చి, తెలంగాణకు తక్కువ ఇచ్చినా ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా చేస్తే.. తెలంగాణ ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత మరింత పెరుగుతుందని, ఇది వారికే నష్టమని సీనియర్ రాజకీయ విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు. అన్నింటికీ మించి గొప్ప విషయం ఏమిటంటే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినా సాదించిందేంటి లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ఆర్భాటపు ప్రకటనలు చేస్తుండడాన్ని తెలంగాణ ప్రజలు సైతం గమనిస్తున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ అనుకున్న విధంగా ముందుకెళ్లలేకపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ ప్రజల పట్ల ఔదార్యం చూపించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!